Wednesday, January 25, 2023

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా.... MLA తో ప్రాణాహాని ఉందని ఆరోపణ....!

*జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా.... MLA తో ప్రాణాహాని ఉందని ఆరోపణ....!*

జగిత్యాల: తెరాస జగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ వేధింపులు భరించలేక పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.బుధవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ.. ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి కంటతడిపెట్టారు. ప్రశ్నించడంతోనే ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

''మీకు పిల్లలు ఉన్నారు. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరించారు. డబ్బుల కోసం డిమాండ్‌ చేశారు. మేము ఇచ్చుకోలేం అని చెప్పాం. దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్షగట్టారు. అన్ని పనులకు అడ్డొస్తూ చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయొద్దని హుకుం జారీ చేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి నరకప్రాయంగా ఉంది. నడిరోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యా. ఎమ్మెల్యేతో పోలిస్తే మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి చిన్నది అంటూ అవమానించారు. ఎన్ని అవమానాలు చేసినా అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లా. చెప్పకుండా వార్డు సందర్శన చేసినా వారి దృష్టిలో నేరమే. ఒక్క పనికూడా నా చేతులతో ప్రారంభించకుండా చేశారు. జిల్లా కలెక్టర్‌ను కలవొద్దని ఆదేశించారు. అనుకూలంగా ఉన్న కొద్దిమంది కౌన్సిలర్లను కూడా ఇబ్బంది పెట్టారు. అందరిముందూ అవమానించేవారు. బీసీ మహిళననే కక్షగట్టారు. సబ్బండ వర్గాలు రాజకీయాలకు పనికిరారా? పేరుకే మున్సిపల్‌ ఛైర్మన్‌ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యేదే. నాకు మాట్లాడే స్వేచ్ఛకూడా ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన స్క్రిప్టే చదవాలి. కవితను కూడా కలకూడదు, కేటీఆర్‌ పేరు ప్రస్థావించకూడదు అని హుకుం. ఆశీర్వదిస్తూ కవిత ఇంటికి వస్తే వేధింపులు. ఎమ్మెల్యేతో మా ప్రాణాలకు ముప్పు ఉంది. మా కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మెల్యే సంజయ్‌ కుమారే కారణం. రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని వేడుకుంటున్నా'' అని శ్రావణి మీడియా సమావేశంలో వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment