*రాష్ట్రాభివృద్ధికి రాజ్ భవన్ సహకారం.... గవర్నర్....!*
హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
''ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎంతో అంకితభావం కనబరిచారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉంది.
శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోంది. వైద్యం, ఐటీ రంగాల్లో భాగ్యనగరం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్ అనుసంధానమై ఉంది. ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోదీ వందేభారత్ రైలును కేటాయించారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ అందిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో రాజ్‌భవన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. వారిలో పోషకాహార సమస్య నివారణకు కృషి చేస్తున్నాం'' అని గవర్నర్ తెలిపారు. ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు ఎం.ఎం.కీరవాణి, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment