Wednesday, January 20, 2021

ఎల్ఆర్ఎస్ పై కఠిన చర్యలొద్దు

హైదరాబాద్ : 21/01/2021

*ఎల్ఆర్ఎస్ పై కఠిన చర్యలొద్దు.......!*
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)లో భాగంగా తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదంటూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌తోపాటు అపరాధ రుసుంతో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకం(బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం/బీపీఎస్‌)కు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ల వ్యవహారాలు ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 28కు వాయిదా వేసింది.
అక్రమ లేఔట్లు, అందులోని ప్లాట్‌లను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 20న జారీ చేసిన *జీవో 131* ను సవాలు చేస్తూ *ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కప్పర ప్రసాదరావు, పి.శ్రీధర్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌ తదితరులు ప్రజాప్రయోజన పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం విదితమే*.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో కొందరు మొత్తం జీవోను సవాలు చేయగా, మరికొందరు కొన్ని నిబంధనలను సవాలు చేశారని పిటిషనర్ల తరఫు *సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి* తెలిపారు. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్‌లను 4 నెలలపాటు నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసినట్లు మరో పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ జీవో 131 మొత్తాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపడతామని, ఇతర పిటిషనర్‌లు దీనికి అనుబంధంగా వాదనలు వినిపించాలని సూచించింది.

ఈ దశలో అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) బి.ఎస్‌.ప్రసాద్‌ జోక్యం చేసుకుంటూ ఇందులో ఒక పిటిషన్‌లో మినహా మిగిలినవాటిలో కౌంటర్లు దాఖలు చేశామని తెలిపారు. అయితే ఈ వివాదం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని తెలిపారు. జువ్వాడి సాగర్‌రావు వర్సెస్‌ కేంద్రం కేసులో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలనూ ప్రతివాదులుగా చేసిందని తెలిపారు. తెలంగాణతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు క్రమబద్ధీకరణకు జీవోలు జారీ చేశాయని, ఇలాంటి సమస్య దేశం మొత్తం ఉన్న నేపథ్యంలో మొత్తం పరిస్థితి గురించి తెలుసుకోవడానికిగాను సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చిందన్నారు.

ఈ మేరకు డిసెంబరు 16న ఉత్తర్వులు జారీ చేసిందని, దీనికి సంబంధించిన ఉత్తర్వుల కాపీ అందిందని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌లకు చెందిన జీవోలు 131, 152లు కూడా ఈ పరిధిలోకి వస్తాయన్నారు. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ సుప్రీం కోర్టు పిటిషన్‌తోపాటు ఉత్తర్వుల కాపీని హైకోర్టుతోపాటు అందరికీ అందజేయాలని ఆదేశించింది.

*ఈ దశలో సీనియర్‌ న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం చెల్లించడానికి జనవరి 31వ తేదీ గడువుగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. సుప్రీం కోర్టులో తేలేదాకా ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఏజీ హామీ ఇవ్వడంతో ధర్మాసనం నమోదు చేస్తూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టులో తేలిన తరువాత వీటిపై విచారణ చేపడతామంటూ ఏప్రిల్‌ 28వ తేదీకి వాయిదా వేసింది*.

*link Media 🖋️ **

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment