Thursday, October 13, 2022

తెలంగాణలో జోడో యాత్ర.. రూట్‌ మ్యాప్‌ ఇదే!

తెలంగాణలో జోడో యాత్ర.. రూట్‌ మ్యాప్‌ ఇదే!

హైదరాబాద్‌: భారత్‌ జోడో యాత్ర 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. 31న హైదరాబాద్‌లోకి రానున్న ఈ యాత్ర తెలంగాణలో 375 కిలోమీటర్లు సాగుతుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం, బోయిన్‌పల్లి, బాలానగర్, మూసాపేట్, కూకట్‌పల్లి, మియాపూర్, BHEL, పటాన్ చెరువు, ఔటర్‌ రింగ్ రోడ్ ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, సంగారెడ్డి రిజర్వు ఫారెస్ట్, జోగిపేట్, శంకరంపేట్, మద్దునూర్ వరకు సాగనుంది. 

Wednesday, October 12, 2022

ఏటు తేలని హిజాబ్ వివాదం,బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జడ్జిలు.

ఏటు తేలని హిజాబ్ వివాదం,బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన జడ్జిలు.

ఢిల్లీ:హిజాబ్ అంశంపై పరస్పర భిన్న తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు ధర్మాసనం. న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధూలియా వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. కర్నాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా జస్టిస్ సుధాన్షు ధులియా మాత్రం హైకోర్టు తీర్పును తోసిపుచ్చారు. భిన్న అభిప్రాయాలతో కూడిన తీర్పు నేపథ్యంలో విస్తృత ధర్మాసనానికి కేసు బదిలీ చేయాలని జడ్జీలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఫార్సు చేశారు.ఒక న్యాయమూర్తి హిజాబ్ నిషేధాన్ని సమర్థించగా, మరొకరు వ్యతిరేకించారు. తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సమర్థిస్తూ కర్నాటక హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీం ద్విసభ్య ధర్మాసంన దీనిపై ఎటూ తేల్చలేదు.ఇద్దరూ విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. దీంతో విస్తృత ధర్మాసనానికి ఈ కేసు విచారణ వెళ్లనుంది.

Ccourtesy by : Q న్యూస్ మీడియా 

Tuesday, October 11, 2022

16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. ఫిబ్రవరిలో మెయిన్స్‌

16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. ఫిబ్రవరిలో మెయిన్స్‌


16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. ఫిబ్రవరిలో మెయిన్స్‌
  • గ్రూప్‌-1లో తొలిసారి బయోమెట్రిక్‌
  • మూడు రోజుల్లో ప్రాథమిక ‘కీ’
  • బబ్లింగ్‌లో తప్పులుంటే నో కరక్షన్‌
  • 2 గంటల ముందే రావాలి
  • త్వరలో గ్రూప్‌-2, 3
  • నమస్తే తెలంగాణతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 11 (నమస్తే తెలంగాణ): గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. 16వ తేదీన 33 జిల్లా కేంద్రాల్లో 1,019 సెంటర్లలో పరీక్ష జరగనున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్‌-1లో టీఎస్‌పీఎస్సీ కీలక మార్పు చేసింది. తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశ పెట్టబోతున్నది. తొలిసారిగా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా జంబ్లింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్ల గురించి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్ధన్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. పరీక్ష నిర్వహించే తీరు, కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలు ఆయన మాటల్లోనే..

మాస్‌ కాపీయింగ్‌కు చెక్‌…
గ్రూప్‌-1 పరీక్షల్లో కొత్తగా ఎన్నో సవరణలు చేశాం. ప్రశ్నలను భారీగా జంబ్లింగ్‌ చేశాం. ఇప్పటివరకూ ఏ, బీ, సీ, డీ సిరీస్‌ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు వరుస క్రమంలో ఇచ్చేవారు. కానీ ఇకపై ఎక్కువ సిరీస్‌లలో వచ్చేలా ప్రశ్నపత్రాలను సిద్ధం చేశాం. ఆ ప్రశ్నలను కంప్యూటర్‌లో జంబ్లింగ్‌ చేశాం. ఉదాహరణకు.. రాము, రాజేశ్‌ పక్కపక్కనే కూర్చున్నారు. రాముకు ఒకటో నంబర్‌లో ఒక ప్రశ్న వస్తే.. రాజేశ్‌కు అదే ఒకటో నంబర్‌లో మరో ప్రశ్న వస్తుంది. రాముకు 1వ నంబర్‌లో వచ్చిన ప్రశ్నకు 4 చాయిస్‌లు ఒకలా ఉంటే.. రాజేశ్‌కు అదే ప్రశ్నకు 4 చాయిస్‌లు రివర్స్‌లో వస్తాయి. తద్వారా మాస్‌ కాపీయింగ్‌కు చెక్‌ పెట్టాం.

బబ్లింగ్‌లో తప్పులుంటే..
బబ్లింగ్‌ చేసేటప్పుడు ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎవరైనా తమకు కేటాయించిన నంబర్‌ను ఓఎంఆర్‌ షీటులో సరిగా బబ్లింగ్‌ చేయకపోయినా, లేదా అభ్యర్థి, ఇన్విజిలేటర్‌ సంతకాలు లేకపోయినా అతని పేపర్‌ను మూల్యాంకనం చేయబోం. ఈ విషయంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు కూడా ఉన్నాయి.

మూడు రోజుల్లో ప్రాథమిక ‘కీ’
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ముగిసిన మూడురోజుల్లో ప్రాథమిక కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తాం. ఈ నెల 20లోపు ‘కీ’ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తాం. ఆ తర్వాత నిపుణుల కమిటీ ఫైనల్‌ ‘కీ’ని ప్రకటిస్తుంది. గ్రూప్‌ -1 పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఓఎమ్మార్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతాం. పరీక్షకు హాజరైన వారందరి ఓఎమ్మార్‌ షీట్లను అభ్యర్థులు చూసుకోవచ్చు. కీతో పోల్చుకుని ఎన్ని మార్కులొస్తాయో తెలుసుకోవచ్చు. ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా ఫలితాల్లో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తాం.

హాల్‌ టికెట్‌పై ఫొటో సరిగా లేకుంటే..
దరఖాస్తు సమయంలో కొంతమంది ఫొటోలు సరైనవి ఇవ్వలేదు. ఫలితంగా హాల్‌టికెట్‌లో ఫొటో సరిగా లేకపోతే.. అభ్యర్థులు మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకొని గెజిటెడ్‌ ఆఫీసర్‌తో సంతకం చేయించుకుని పరీక్ష కేంద్రానికి రావాలి. అప్పుడే ఆ అభ్యర్థిని పరీక్షకు అనుమతిస్తాం. అందరూ త్వరగా www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సందేహాలుంటే టీఎస్‌పీఎస్సీని సంప్రదించాలి.

ప్రతి అరగంటకూ అలెర్ట్‌ చేస్తాం
పరీక్ష హాలులోకి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించం. పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు కూడా ఉండవు. అందుకే ప్రతి అరగంటకు ఓ సారి అలర్ట్‌ చేసేలా గంట మోగిస్తాం. పరీక్ష కేంద్రంలోకి చెప్పులు మాత్రమే వేసుకొని రావాలి. మెహిందీలు వేసుకొని వస్తే అనుమతించం. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైనప్పుడు ఆ అభ్యర్థి వేలిముద్రలు తీసుకుంటాం. మళ్లీ మెయిన్‌ పరీక్షకు వచ్చినప్పుడు బయోమెట్రిక్‌ తీసుకుంటాం. వేలిముద్ర తీసుకోగానే అభ్యర్థి ఫొటోతోపాటు పూర్తి వివరాలు తెలిసిపోతాయి. ఎవరైనా ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం. అభ్యర్థిపై జీవితకాల నిషేధం విధిస్తాం.

ఫిబ్రవరిలోనే మెయిన్స్‌
గ్రూప్‌-1 పరీక్ష ఫలితాలను రెండునెలల్లోనే విడుదల చేస్తాం. ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మరో నెల ఆలస్యం కావచ్చు. ఫిబ్రవరిలోనే మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తాం. క్వాలిఫై మార్కుల కోసం నిర్వహించే ఇంగ్లిష్‌ పరీక్షను సైతం మెయిన్స్‌లో భాగంగానే నిర్వహిస్తాం. గ్రూప్‌-1లో సెలక్ట్‌ అయ్యే అభ్యర్థులు భవిష్యత్తులో ఐఏఎస్‌లుగా కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. త్వరలోనే గ్రూప్‌ -2, 3 ఉద్యోగాలకు సైతం నోటిఫికేషన్లు ఇస్తాం. దీనికోసం కావాల్సిన కసరత్తు పూర్తయింది. గిరిజన రిజర్వేషన్ల కోసం వెయిట్‌ చేస్తున్నాం. అవి ఖరారు కాగానే నోటిఫికేషన్లు ఇచ్చేస్తాం. అభ్యర్థులు ఎవరూ దళారుల మాటలు నమ్మొద్దు, మోసపోవద్దు.

తొలిసారిగా సీసీ కెమెరాలు
రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో గ్రూప్‌-1 పరీక్ష నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లో ఉండి కెమెరాలను టీఎస్‌పీఎస్సీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. ప్రశ్నపత్రాలను ప్రత్యేక నిఘాలో ఉంచేలా ఏర్పాటుచేశాం. పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌, టీఎస్‌పీఎస్సీ అధికారి సమక్షంలో ప్రశ్నపత్రం ఓపెన్‌ చేస్తాం. దీన్ని మొత్తం వీడియో తీస్తాం. పరీక్ష ముగిసిన తర్వాత ఓఎంఆర్‌ షీట్‌ను సీల్‌ చేసేటప్పుడు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తాం. ప్రతికేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని టీఎస్‌ఆర్టీసీకి సూచించాం. హైదరాబాద్‌ సహా నగరాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాం.

రెండు గంటల ముందే రండి
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ నిర్వహిస్తాం. 10.15 నిమిషాల వరకే పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తాం. గ్రూప్స్‌ వంటి పరీక్ష రాసే అభ్యర్థులకు సమయపాలన ఎంతో అవసరం. తొలిసారిగా బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఒక్కొక్కరి బయోమెట్రిక్‌కు సుమారు 15 సెకన్ల సమయం పడుతుంది. అభ్యర్థులు ఉదయం 8.30 గంటలలోపే పరీక్ష కేంద్రానికి రావాలి. అలా రావడం వల్ల.. టెన్షన్‌ పడకుండా ప్రశాంతంగా పరీక్ష రాయొచ్చు.

Courtesy by : నమస్తే తెలంగాణ మీడియా 

బుల్లెట్లు దూసుకెళ్లినా.... ముష్కరులను వదలని...... జాగిలం

*బుల్లెట్లు దూసుకెళ్లినా.... ముష్కరులను వదలని...... జాగిలం*

మాతృదేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రాణాల మీదకు వచ్చినా వెనకడుగు వేయరు సైనికులు. వారి శిక్షణలో ఓ జాగిలం కూడా అదే తరహా నిబద్ధతను కనబరిచింది.జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు నక్కినట్లు సోమవారం విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ముష్కరులను గుర్తించే పనిని అధికారులు జూమ్‌ అనే జాగిలానికి అప్పగించారు. దీంతో అది ఉగ్రవాదులను గుర్తించి, వారిపై దాడి చేసింది.

ఈ క్రమంలో రెండు తూటాలు శరీరంలోంచి దూసుకెళ్లినా అది పోరాటాన్ని ఆపలేదు. ఇంతలో భద్రతా దళాలు అక్కడికి చేరుకుని, ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదులను గుర్తించి, మట్టుబెట్టడంలో జూమ్‌కు కఠిన శిక్షణ ఇచ్చామని, ఇంతకుముందు కూడా చాలా ఆపరేషన్లలో ఎంతో నిబద్ధతతో వ్యవహరించిందని అధికారులు తెలిపారు. గాయపడిన జాగిలాన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

Our time is now—Our rights, Our future

"Our time is now—Our rights, Our future"
ప్రతి సంవత్సరం లాగానే థీం తీర్మానం చేశారు,కాని ఎక్కడ బాలికల పై జరుగుతున్న అత్యాచారాలు,హింస,చిన్నచూపు ఎన్ని చట్టాలు చేసినా వాటి అమలు చేయడంలో వివక్ష చూపనంత వరకు ఏమి మారదు
#బాలలహక్కులసంఘం తరపున బాలికలకు శుభాకాంక్షలు
తెలుపుతూ మీపై మీకు  విశ్వాసం పెంచుకుని ఏ విధంగా మేం తక్కువ కాదు. మీ హక్కుల కోసం మీరు వెనుకంజ వేయవద్దు,మీ కోసం బాలల హక్కుల సంఘం ఎప్పుడూ మీతో ఉంటుంది.
@Praja_Snklpm @SocietySachin @hydnewstoday @RamMohanINC @IndiraShobanAAP @HelpingspotOrg @PintodeepakD @SrinivasRTIA

Courtesy by : అనురాధ రావు (బాలలహక్కులసంఘం ఫౌండర్)

Monday, October 10, 2022

ఉద్యోగాలు లేవు...విద్యావిధానాన్ని ధ్వంసం చేసారు.... ఫ్రొఫెసర్ హరగోపాల్....!

*ఉద్యోగాలు లేవు...విద్యావి ధానాన్ని ధ్వంసం చేసారు.... ఫ్రొఫెసర్ హరగోపాల్....!*

CM KCR: ప్రొఫెసర్ హరగోపాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు అనుకున్నారని..కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఎంతోమంది నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొన్ని దేశాల్లో హింస లేకుండా శాంతియుత పాలన సాగుతోందని.. సమాజంలో నిరుద్యోగ సమస్య ఏర్పడినప్పుడే హింసలకు పాల్పడుతారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు అనుకున్నారని.. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ సమస్య వెంటాడుతూనే ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానాన్ని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి, నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని రిజర్వేషన్ అడుగుతున్నామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుతున్నారని, రూ. 5 భోజనం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఐటీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

అంతకుముందు కూడా.. తెలంగాణలో వరుసగా చోటు చేసుకుంటున్న నేరాల విషయంలోనూ ప్రభుత్వ విధానాన్ని ప్రొఫెసర్ హరగోపాల్ దుయ్యబట్టారు. చదువుకుంటున్న పిల్లలు కూడా నేరాల్లో పాల్గొంటున్నారని, ప్రభుత్వం ఆ నేరాలను కంట్రోల్ చేయకుండా నేరం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు.. సమాజానికి ఏం విలువలు ఇస్తున్నామనేది చూసుకోవాలని సూచించారు. తెలంగాణ వస్తే మెరుగైన సమాజం వస్తుందని అనుకున్నామని.. కానీ అత్యాచారాలు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం లాంటివి దుర్మార్గమైన చర్యలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనల్ని ఎలా కట్టడి చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. తెలంగాణను ప్రజాస్వామ్య సమాజంగా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని విమర్శించిన ఆయన.. పాత చట్టాలు ఉంటే రాష్ట్రం ఏం మారుతుంది? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం రాసిన పాటలు కూడా బ్యాన్ అయ్యాయని.. అన్ని జేఏసీలు ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందని అన్నారు. టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక.. ఇష్టారాజ్యంగా పబ్బులు పెంచారని.. ఇది చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Sunday, October 9, 2022

ఢిల్లీ లిక్కర్ స్కామ్... అభిషేక్ బోయిన్ పల్లి అరెస్ట్...!

*ఢిల్లీ లిక్కర్ స్కామ్... అభిషేక్ బోయిన్ పల్లి అరెస్ట్...!*

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వేగవంతం చేసింది. గతకొన్ని రోజులుగా పలువురిని విచారించిన సీబీఐ..తాజాగా ఒకరిని అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన అభిషేక్‌ బోయినపల్లి అరెస్ట్‌ చేశామని.. ఆయన్ను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపింది. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు సీబీఐ అరెస్ట్‌ చేసిన వారి సంఖ్య 2కి చేరింది. అభిషేక్‌కు ముందు విజయ్‌ నాయర్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. మరోవైపు ఇదే కేసులో విచారణ చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా సమీర్‌ మహేంద్ర అనే వ్యక్తిని అరస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

*సుజీవన్ వావిలాల*🖋️