Sunday, April 6, 2025

రారా బై .. క్యాంపస్ కు రా .. "బోగస్" ఏదో తేల్చేద్దాం

రారా బై ..  క్యాంపస్ కు రా .. "బోగస్" ఏదో తేల్చేద్దాం 

Courtesy/ Source by:
కన్నెగంటి రవి, తెలంగాణ పీపుల్స్ 
జాయింట్ యాక్షన్ కమిటీ,                         
ఫోన్: 9912928422 
( హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 
విద్యార్ధుల పోరాటానికి సంఘీభావంగా)
 06- 04-3025
---------------------------------------------

పచ్చని చెట్టు నిజం 
చెట్లతో నిండిన అడవి నిజం 
గంతులేసే జింక నిజం 
నాట్యమాడే నెమలి నిజం 
రివ్వున ఎగిరే పక్షి నిజం 
చెవులకు మధురంగా 
వినిపించే పిట్ట కూత నిజం 
నువ్వూ, నేనూ బతకడానికి పీలుస్తున్న గాలి నిజం 
పచ్చని పర్యావరణంతో 
నిండిన  ఆ ప్రాంతం నిజం 
తెలంగాణ అమరుల 
ఆత్మ బలిదానాల సాక్షిగా 
చదువుల తల్లి కోసం 
ఇందిరమ్మ ఇచ్చిన 
వేలాది ఎకరాల  ఆ భూమి  నిజం,
దళారీ  గా మారి ఆ భూములను నువ్వు అమ్ముకోవాలను కుంటున్నది నిజం  

                ---------------------- 

ఇక్కడ ఉన్నది 
రోజూ నువ్వు  చొంగ కార్చుకుంటున్న 
కృత్రిమ  మేధ కాదు 
నువ్వు  “బోగస్” అనగానే 
వణికి పోవడానికి, పారిపోవడానికి 

ఇక్కడ  మనసున్న మనుషులున్నారు, 
ప్రపంచం మెచ్చిన మేధావులున్నారు 
జింకలనూ, గుంట నక్కలనే కాదు, 
ఆకునూ, కొమ్మనూ, 
పశువునూ, మేతనూ,  
చివరికి నేలలోని సూక్ష్మ జీవినీ  
కౌగిలించుకునే  
కష్టజీవుల బిడ్డలున్నారు 

నీకూ, నాకూ  మాట్లాడే 
స్వేచ్చనిచ్చిన 
డాక్టర్ బాబా సాహెబ్  వారసులున్నారు 
సమానత్వం కోసం  
ప్రాణాలైనా అర్పించాలని 
బోధించిన కారల్ మార్క్స్  
కామ్రేడ్స్ ఉన్నారు 
వాళ్ళ  మాట నిజం, 
వాళ్ళ ఘోష నిజం 
లాటీ దెబ్బలకు వెరవని 
వాళ్ళ  పోరు నిజం 

                 --------------- 
నిజాలు నీ మనసును నిప్పులా కాలుస్తాయి కానీ, 
నువ్వు  పంపిన బందూకుల మధ్య 
బరి గీసి నిలబడేది ఈ నిజాలే. 

బడా బాబులకు భూములను  
కట్ట బెట్టిన నీ “బాబు”న్నాడే, 
అదే “చంద్రబాబు”న్నాడే, 
యూనివర్సిటీ  
భూముల సరిహద్దులు 
మార్చాలని మొదలెట్టిన 
మొదటి ఆక్రమణ దారు 
రియల్ ఎస్టేట్ మాఫియా కంపనీల  
మొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 

ముఖ్యమంత్రి గద్దె కాపాడుకోవడానికి 
నువ్వు  రోజూ 
“రాహుల్” నామం జపిస్తున్నా, 

నిజానికి చంద్ర బాబు బాటలో 
నడవాలనుకుంటున్న  వాడివి, 
రియల్ ఎస్టేట్ నా DNA లో ఉందని  
నిస్సిగ్గుగా ప్రకటించుకున్నవాడివి 
గద్దె నెక్కింది ఎందుకో  రోజూ నిరూపిస్తున్న వాడివి 

ఫోర్త్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు,  
ఫార్మా  సిటీ, మూసీ పునరుద్ధరణ 
పేరేదైనా కావచ్చు,  
ప్రాంతం ఏదైనా కావచ్చు 
మెలకులవ లోనూ, కల లోనూ 
“భూమి” చుట్టూ 
ప్రదక్షిణ చేస్తున్న వాడివి 
భూమి పుత్రులను భూమి నుండీ  
తరిమేయాలని తపిస్తున్నవాడివి 

నీ ఆగడాలను అడ్డుకున్న వాళ్ళను, 
అన్యాయమని అరుస్తున్న వాళ్ళను 
గూండాలు  అంటావ్, 
గుంట నక్కలంటావ్
ప్రతిపక్ష పార్టీల పెయిడ్ ఆర్టిస్టులంటావ్ 

మనిషి కాకుండా పోయిన వాడికే,  
మేము అబద్ధాలలా కనపడతాం 
అద్దాల మేడలో కూర్చున్న వాడికే
మేమో అరాచక 
మూకగా వినిపిస్తాం 
రారా భై, యూనివర్సిటీ 
క్యాంపస్ కు రా.. 

చుట్టూ పోలీసుల కాపలా  వదిలి, 
అధికార  చట్రం పొగరు వదిలి, 
మా చుట్టూ అల్లుకున్న అడవికి రా.. 
మీ బుల్డోజర్లు ధ్వంసం చేసిన 
దృశ్యాలు చూద్దువు రా.. 
                     -------------
ప్రభుత్వ భూముల కోసం 
రైతుల, ఆదివాసీ ల 
భూముల కోసం 
ఆశ పడే వారిలో, 
ఆక్రమించుకునే వారిలో 
నువ్వు  మొదటి వాడివీ కాదు, చివరి వాడివీ కాదు

మీ పెద్దన్నలు మోడీ, 
KCR, చంద్ర బాబు 
అహ్మదాబాద్ నుండీ 
అమరావతి వరకూ 
మల్లన్న సాగర్ మీదుగా 
లగచర్ల వరకూ 
అధికారమే అండగా, 
బడా బాబులే వెంట రాగా 
అందరికీ అన్నం పెట్టే 
భూమినీ, ఆకుపచ్చ అడవినీ ఆక్రమించుకున్నారు.. 
ప్రతిఘటించిన వాళ్ళ 
ప్రాణాలు తీశారు  

అందుకే విను, 
మాకు విద్య  తెలుసు, 
విలు విద్య తెలుసు
మాకు న్యాయం తెలుసు, 
నాగేటి చాళ్లలో నెత్తురు పారించడమూ తెలుసు 

భూమి కోసం జరిగే 
ఈ అనివార్య యుద్దంలో 
నీకు అధికార బలం 
మాత్రమే ఉంది. 
మాకు అన్నం పెట్టే అన్నదాతల,
పర్యావరణాన్ని ప్రేమించే 
పట్టణ వాసుల అండ ఉంది.. 
మేము నిలబడతాం.. 
మేమే గెలుస్తాం ..

No comments:

Post a Comment