Saturday, February 25, 2023

తెలంగాణలో రేపటి నుండి ఇంటింటికి.... తెలుగుదేశం..... కాసాని జ్ఞానేశ్వర్

*తెలంగాణలో రేపటి నుండి ఇంటింటికి.... తెలుగుదేశం..... కాసాని జ్ఞానేశ్వర్*

హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగుదేశం పూర్వవైభవం దిశగా అడుగులు పడుతున్న వేళ యువత, మహిళలు, విద్యావంతులకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు.రాష్ట్రంలో రేపట్నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మొదలవుతుందని ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రకటించారు. హైదరాబాద్ ఎస్ఆర్‌నగర్‌లోని తన నివాసంలో మీడియాతో కాసాని చిట్‌చాట్ నిర్వహించారు.

రాష్ట్రంలో పది రోజులపాటు మండలం యూనిట్‌గా ప్రతి బూత్ స్థాయిలో ఇంటింటికీ తెదేపా కార్యక్రమం ఉంటుందని కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో డివిజన్ల వారీగా కొనసాగుతుందని చెప్పారు. అదే ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకుంటూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపడతామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని డివిజన్లలో ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో భాగంగా నాడు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కిలో రూ.2 బియ్యం పథకం, పట్వారీ, పటేల్ వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్తి హక్కు, బీసీ వర్గాలకు పెద్దపీట వంటి అంశాలు వివరించడంతోపాటు తెదేపా పూర్వ వైభవం కోసం సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. పది రోజుల తర్వాత మరో 20 రోజులపాటు ప్రతి మండలంలో అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు చేపడతామని తెలిపారు. తెదేపా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మార్చి 27వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 'సింహగర్జన' పేరిట లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని... ఆ సభకు ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరవుతారని కాసాని వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment