Tuesday, May 28, 2024

జోహార్లు నివాస హక్కుల ఉద్యమకారుడు అశ్వాక్ గారిki

నివాస హక్కుల ఉద్యమకారుడు అశ్వాక్ గారిని తలచుకుందాం!

అశ్వాక్ సార్ మరణించి ఈ రోజుతో (28 May ) మూడు సంవత్సరాలు పూర్తి అయ్యింది. నివాస హక్కుల పోరాటం లో అయన లేని లోటు మాత్రం బాగా కనిపిస్తోంది.

హైదరాబాద్ లో 1950 లలో, మూసి నది పక్కన ఉన్న ఖాళీ ప్రదేశం లో గొర్రెలను మేపడానికి గడ్డి పెంచుకుంటూ 7 ఇళ్ళు ఏర్పడ్డాయి. కాలక్రమంలో ఆ 7 ఇళ్ళు, రకరకాల కార్మికులు ఉండే ఒక పెద్ద బస్తీగా మారింది. ఈ మార్పును మొత్తం గమనిస్తూ పెరిగిన వ్యక్తి అశ్వాక్ సార్. 

బాధ్యతగా వ్యవహరించడం, సమస్య పరిష్కారం వైపు ద్రుష్టి పెట్టడం, పనిలోకి దిగడం, ఆసక్తి కలిగిస్తూ మాట్లాడటం వంటివి, సార్ ని బస్తీ నాయకుడిని చేసాయి.  మూసి సుందరీకరణ పేరుతో, మూసి ప్రవాహాన్ని పరిమితం చేసి, పార్కులు కట్టడానికి, 36 బస్తీలు కూలిపోతాయి అన్న వార్త ఆయన్ని నివాస హక్కుల కార్యకర్తని చేసింది . మూసి బచావో ఆందోళన్ విజయం ఆయనను సామజిక కార్యకర్తగా, నివాస హక్కల ఉద్యమ నాయకుడిగా  మార్చేసింది. ఆ తరువాత బ్రదర్ వర్గీస్, జీవన్ కుమార్ గార్ల్తతో  కలిసి నివాస హక్కుల మీద ఛత్రి  అనే సంస్థ ( నివాస హక్కుల పరిరక్షణ సమితి ) ను ఏర్పాటు చేసి  దాని ద్వారా మూసి బస్తీలు మాత్రమే కాకుండా హైదరాబాద్ లోని అన్ని బస్తీ సమస్యల పట్ల నిబద్దతో ద్రుష్టి   సారించారు.  ఒక సందర్భం లో బస్తీ సమస్యలను GHMC కమిషనర్ సరిగ్గా పట్టించుకోడం లేదని, కమిషనర్ కార్యాలయం లో గట్టిగా తోలు డప్పు వాయించి, బయటికి గెంటివేయబడ్డారు. తప్పుడు కేసులు బనాయించబడ్డాయి, ఆయనని భార్యని పోలీసులు తీసుకెళ్లి వేరే పోలీస్ స్టేషన్ లో ఉంచారు, జంక లేదు, సమస్యల పట్ల పోరాటం మానలేదు.

మేధా పాట్కర్ తో పని చేసారు. NAPM,  ఘర్ బనావో, ఘర్ బచావో ఉద్యమం లో, వీధిలో వ్యాపారస్తుల సమస్యల పట్ల, నాగపూర్, డిల్లీ, ముంబై, కలకత్తా  వంటి నాగరాలలో పలు సమావేశాలలో పాల్గొని జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. 

అశ్వాక్ సార్ మంచి సరదా మనిషి. కొన్ని సార్లు పాత జ్ఞాపకాలు నెమరు వేసేవారు. అయన ఇష్టంగా చెప్పే విషయాలలో, ప్రాగా టూల్స్ దగ్గరి థియేటర్ లో అయన పనిచేసినప్పటి అనుభవాలు, పెయింటింగ్ వర్క్ లో అనుభవాలు, పోలవరం విషయం లో ఫాక్ట్ ఫిండింగ్ కు ట్రైబల్ ఏరియా కి వెళ్ళినపుడు మానవ హక్కుల వేదిక బాలాగోపాల్ అయన మీద వేసిన సరదా జోకులు, తప్పుడు కేసులు కొట్టివేశాక కోర్టు హాల్ లోనే న్యాయం గెలించింది అంటూ మానవ హక్కుల వేదిక జీవన్ కుమార్ గారితో ఇచ్చిన నినాదాలు, ఆ సమయం లో జడ్జి గారి ముఖ కవళికలు, అప్పటి పెహల్వాన్లు...... ఇలా చెబుతూనే ఉండేవారు. 

అశ్వాక్ సార్కి, ఉర్దూ మాత్రమే చదవడం రాయడం వచ్చు. తెలుగు ఇంగ్లీష్ విషయం లో, అయన తెలివితేటలూ, జ్ఞాపకాశక్తిని వాడే వారు. ప్రతీ ఫోను నంబరు ఆయనకు గుర్తే. ప్రభుత్వ అధికారులకు ఏదైనా లెటర్ ఇవ్వాలంటే, చుట్టూ ఉన్న వాళ్ళతో అడిగి రాయించుకునే వారు. ఆ రాసే వారి దగ్గర పెన్ను ఉండదని ఎప్పుడు తన జేబులో పెన్ను పెట్టుకునే తిరిగే వారు.

సార్కి వెస్ట్రన్ సెక్యూలరిజంకి ఇండియన్ సెక్యూలరిజంకి తేడా తెలియదు. కాకపోతే మతం రాజకీయాలలో ఉండకూడదని, పరమతసహనం ఉంటేనే ప్రజలు కలిసిమెలిసి ఉండగలరని తెలుసు. వీటికి అయన పెద్ద పేర్లు ఏమి పెట్టలేదు. ముస్లింలు ఎక్కువగా ఉన్న బస్తీ లీడర్ అయినా, అక్కడి మసీదు  వ్యవహారాలు చూసుకుంటున్నా, MIM మాత్రం అక్కడ అడుగు పెటట్టకుండా  బ్రతికినన్నాళ్ళు జాగ్రత్త పడ్డారు. 

ప్రతి సమస్యను, రకరకాల సిద్ధాంతాల ప్రకారం విశ్లేషంచి, మసి పూసి మారేడు కాయను చేసి, అసలు  తాము లేకపోతే ఆ సమస్య విశ్లేషణ జరిగి ఉండేది కాదని నమ్ముతూ, ఆ సమస్య పట్ల వేరే సిద్ధాంత విశ్లేషణతో ఉన్న మేధావుల తెలివితేటలని కించ పరుస్తూ ఉండే మేధావులు, ఆ విశ్లేషణలు తెలుసుకోవడమే సమాజ సేవ అనుకునే వారిలో అశ్వాక్ సార్ లాంటి కార్యసిద్దులు ఇమడలేరు. ఇలా సిద్ధాంతరించకుండా సమస్య పరిష్కారం వైపు మొగ్గు చూపేవారిని తమలో ఒకడిగా మేధావులు ఒప్పుకోలేరు.

ఈ సామజిక సిద్ధాంతాల గోల లేకుండానే, పేద ప్రజలకి ఏది మంచిది ఏది కాదు అనే ఆలోచన శక్తి అనుభవం నుంచి సంపాదించిన వ్యక్తి అయన. హక్కుల పోరాటం లో ముందు వరుసలో ఉండేవారు.

సమాజం లో ప్రజాస్వామిక విలువలు పెరగాలి అంటే, తమ చుట్టూ ఉన్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం ఏమిటి అన్న ఆలోచన, దాని కార్యాచరణ తమదని నమ్మే అశ్వాక్ సార్ లాంటి వ్యక్తులు పెరగాలి.

అయన మరణం తో హైదరాబాద్ నగరం ఒక హక్కుల ఉద్యమకారుడితో పాటు , హైదరాబాద్ బస్తీల పట్ల విజ్ఞానాన్ని కూడా కోల్పోయింది.

నివాస హక్కుల కార్యకర్త అశ్వాక్ సార్.... జోహార్ జోహార్

Courtesy / Source by :
సంజీవ్
మానవ హక్కుల వేదిక

No comments:

Post a Comment