Tuesday, January 13, 2026

_మళ్ళీ గద్దలు వాలుతున్నాయ్..!! మీడియా ముసుగులో దందాలు.._

*_మళ్ళీ గద్దలు వాలుతున్నాయ్..!!_*
_* మీడియా ముసుగులో దందాలు.._
_* ఒక్కొక్కడికి పదుల పత్రికలు_
_* యాడ్ ఏజన్సీలతో నిలువుదోపిడీలు_
_* పదవులు కోసం ఎదురుచూపులు_
_* తెలంగాణ మీద వాలుతున్న 'ఆంధ్ర గద్దలు'_
_* పదేళ్ల క్రితం పారిపోయినోళ్లు ప్రత్యక్షం_
_* పెత్తనాల కోసం మొదలైన ఆరాటం._
_* నమస్తే 'బంద్'_

COURTESY/SOURCE by:
_(అనంచిన్ని వెంకటేశ్వరావు, వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం, 9440000009)_

*_‌వలసవాదులు మళ్లీ వచ్చేశారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన వెంటనే వాలిపోయారు. రాజకీయం తప్ప అన్నీ ఊడ్చుకుపోయేందుకు మళ్ళీ గద్దల్లా వచ్చి వాలుతున్నారు. షర్మిల రూపంలో రాజకీయం విఫలమైనా, ఆర్థిక వనరులు కొల్లగొట్డుకునేందుకు వచ్చారు. తెలంగాణ మేధావులు, సీనియర్ జర్నలిస్టులు ఒక్క పత్రిక నడపడానికే నానా అవస్థలు పడుతుంటే.. ఒక్కొక్కడికి పదుల సంఖ్యలో పత్రికలా..అదెలా సాధ్యమో ఐఅండ్‌పిఆర్ అధికారులే చెప్పాలి. ఎలా ప్రకటనలు జారీ చేస్తున్నారో వివరాలు చెప్పాలి. అలా ప్రకటనలు జారీకి ఎంత కమీషన్ దండుకుంటున్నారో వెలుగులోకి రావాలి. అందులోనూ ఆంద్రా మూలాలున్న వారితో పాటు పదుల సంఖ్యలో పత్రికలు నడుపుతున్నట్లు కలరింగ్ ఇస్తూ, జిరాక్స్ కాపీలు తీసి పత్రికలని నమ్మిస్తూ తెలంగాణ సొమ్ము దోచేస్తున్న దగుల్బాజీల బండారం బైటపడాలి. పదుల సంఖ్యలో పత్రికల ముసుగులో, మధ్య తరహా పత్రికల పేరుతో మోసం చేస్తున్న వారి బాగోతాలు బైటపడాలి. అసలు యంత్రాంగమే లేకుండా పత్రికలు నడిపేవారిపై ఎంక్వౌరీ వేయాలి. గతంలో జరిగిన ఎంక్వౌరీ వివరాలు బైటపెట్టాలి. మళ్లీ  పూర్తి స్థాయిలో ఎంక్వౌరీ చేపట్టాలి. తెలంగాణ రాగానే ఇక్కడ పత్రికల ముసుగులో పబ్బం గడపుకోవడం కుదరదని ఆలోచించుకున్న కొందరు విజయవాడకు వెళ్ళిపోయారు. పత్రికలు అక్కడినుండి నిర్వహించుకున్నారు. అక్కడ చంద్రబాబు పాలనలో దండుకోవాల్సినంత దండుకున్నారు. జగన్ రాకతో సమైక్యవాదులు గిలగిలలాడిపోయారు. కనీసం ఆంధ్రప్రదేశ్‌లో అక్రిడిటేషన్లకు కూడా దిక్కులేకుండా పోయింది. దాంతో తెలంగాణలోనే  మళ్ళీ నూకలు సంపాదించుకుందామని వచ్చారు. అలా ఆంధ్రాకు వెళ్లిపోయేవారు వెళ్లిపోగా, కొంత అతి తెలివి మంత్రులు అటు పత్రికల ముసుగులో యాడ్ ఏజెన్సీలు మొదలుపెట్టారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్లదే హవా...తెలంగాణ వచ్చిన తర్వాత కూడా  వాళ్లే లబ్దిపొందారు. తెలంగాణలో ప్రభుత్వం మారడంతో మొత్తం దిగిపోయారు._*

*_ఒక్కొక్కడికి పది పేపర్లా?_*
వినడానికి ఆశ్చర్యంగా వుందా? మీరు చదివింది నిజమే..పదిపది పత్రికలు నడిపేవాడికొక్కడికి అక్షరం ముక్క రాయరాదు. అందులోనూ ఇంగ్లీషు పత్రికలు కూడా నిర్వహిస్తుంటారు. సహజంగా ఒక ఎడిటర్‌కు ఒక్క పాత్రిక నడపడమే గగనం. అలాంటిది ఈ అక్షరం ముక్క రాని కొంతమంది సోకాల్డ్ దగా కోరులు పలు పత్రికలు నడుపుపుతుంటారు. పదిపత్రికలలో అన్నీ అవే వార్తలు. ఇలా కూడా తెలంగాణ సొమ్ము తినొచ్చని నేర్చుకున్నారు. తెలంగాణ బొక్కసానికి పొక్కపెడుతున్నారు. అవి పత్రికలు కాదు...జిరాక్స్ కాపీలు మాత్రమే. ఒక్కసారి ఐఅండ్‌పిఆర్ దుమ్ము దులిపితే ఎంత మంది అక్షరం రాని వాళ్లు పత్రికలు నడుపుతున్నారో తెలుసుకోవచ్చు. 

*_ఈ దగాకోరుల కోసం జర్నలిస్టుల జీవితాలు విలవిల_*
అవో పత్రికలు. వాటికి యాజమాన్యాలు. విలేకరులకు బెదిరింపులు. పండగలు వచ్చాయంటే ప్రకటనలు తేవాలి. వేళాది రూపాయలు పంపాలి. కొత్త సంవత్సరం వేళ లక్షలాది రూపాయల ప్రకటనలు సేకరించాలి. ఎన్నికలొస్తే ఇక విలేకరులకు నరకమే. అక్రిడిటేషన్లు జారీ చేసే సమయంలో అదో వ్యాపారం. ఏడాదంతా యాజమాన్యాలను మేపుతున్న విలేఖరులకు అక్రిడిటేషన్ కావాలంటే వేలాది రూపాయల ముట్డజెప్పాల్సిందే..ఇలా జర్నలిస్టుల రక్తం తాగుతున్నారు. ఇలా యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక అప్పులు చేసి, ఆత్మహత్యలు చేసుకున్న జర్నలిస్టులు ఎంతో మంది వున్నారు. అందుకే నిజాయితీగా సమాజం కోసం తపనపడే పత్రికలు మాత్రమే నడవాలి. తెలంగాణ ముసుగులో సాగే 'ఆంధ్రా దోపడీ' ఆగాలి. 

*_అన్నీ ఆంద్రా యాడ్ ఏజెన్సీలే_*
తెలంగాణ వచ్చినా తెలంగాణ యాడ్ ఏజెన్సీలకు దిక్కేది. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనల్లో తెలంగాణ యాసకు చోటేది. సినిమాలలో తెలంగాణ యాస వాడుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చే ప్రభుత్వ ప్రకడనలన్నీ ఆంధ్రా యాసలోనే ఎందుకుంటున్నాయి. అంటే తెలంగాణ వచ్చినా తెలంగాణ యాడ్ ఏజెన్సీలకు గుర్తింపు లేదు. తెలంగాణ యాస వచ్చిన వాళ్లు లేరు. తెలంగాణ యాసలో ప్రకటనలు తయారు చేయాలంటే, తెలంగాణ వారికే ఇవ్వాలి. కానీ లాబీయింగ్ అంతా ఆంధ్రాదే...కమీషన్లకు కక్కుర్తి పడిన వాళ్ల వల్ల జరుగుతున్న మోసానికి తార్కాణమిదే... ఆంధ్రప్రదేశ్‌లో వీళ్లే... తెలంగాణలోనూ వాళ్లే... తెలంగాణ వచ్చినా బతుకుతున్నది ఆంధ్రా వాళ్లే... తెలంగాణ వాళ్లు ఆంధ్రాలో యాడ్ ఏజన్సీ నడపగలరా? ఒక్కసారి ఆలోచించండి.

*_వార్తలతో...నాలుగు జిరాక్స్‌లు తీస్తే సరి_*
అవును అదే...పత్రిక. న్యూస్ ఏజెన్సీల వార్తల మీద ఆధారపడి పత్రికలు నడుపుతున్నట్లు బిల్డప్ ఇవ్వాలి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సొమ్ముంతా అప్పటి  ప్రభుత్వం అలాంటి వారికి దారపోసింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలంగాణ పత్రికలు ఏవి? నిజాయితీగా నడుస్తున్నవేవి? జర్నలిస్టుల యోగ క్షేమాలు చూస్తున్నవేవి? నిజమైన జర్నలిస్టులను ఆదరిస్తున్న పత్రికలు ఏవి? అన్నది గుర్తించాలి. దానికి తోడు జర్నలిస్టును రాచి రంపానపెడుతున్నవి ఏవి? కనీసం ప్రింటింగ్ సెక్షన్ కూడా లేకుండా నడుస్తున్నవి ఏవి? అసలు కార్యాలయమే లేకుండా నడుస్తున్నట్లు భ్రమింపజేస్తున్న పత్రికలు ఏవి? జర్నలిస్టుల వార్తలకు విలువలు ఇస్తున్న పత్రికలు ఏవి? గతంలో ఐఅండ్‌పిఆర్ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించి, అప్ గ్రేడ్ అయిన పత్రికలు ఏవి? అన్నవాటిపై కచ్చితంగా విచారణ జరిపించాలి. అంతే కాకుండా కేవలం న్యూస్ ఏజెన్సీల మీద ఆధారపడి, పత్రికలు నడుపుతున్నట్లు నటిస్తూ, నాలుగు పత్రికలు జిరాక్స్ లు తీసి, పదుల సంఖ్యలో పత్రికల పేరుతో దోచుకుంటున్న దొంగల గుట్టు రట్టు కావాలి. లేకుంటే తెలంగాణ అస్థిత్వానికే ప్రమాదం రావొచ్చు. సాంస్కృతిక విధ్వంసం జరగొచ్చు. తెలంగాణ యాస మరింత మరుగునపడిపోవచ్చు. 

*_అవకాశవాదులు పదవుల కోసం_*
ఏ ఎండకు ఆ గొడుగుపట్టే గోడ మీద పిల్లలు ఎప్పుడూ వుంటారు. అసలైన అర్హులకు అవకాశాలు అందకుండా తన్నుకుపోతారు. పెద్ద మనుషులుగా చెలామణీ అవుతుంటారు. పదేళ్ల కల్వకుంట్ల దోపిడీకి చరమగీతం పాడడంలో సున్నా శాతం కూడా పాత్ర లేని వాళ్లు తెల్ల బట్టలేసుకొని, ముందు వరుసక్రమంలో వుంటారు. అలాంటి వారిని దూరం పెట్టాలి. లేకుంటే వాళ్లు తిన్నింటి వాసాలు లెక్కపెడతారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దశ..దిశ పేరుతో సమైక్యవాద ముసుగేసుకొని, తెలంగాణ వాదానికి విలువ లేకుండా చేయాలని చూసిన ఓ పెద్ద మనిషి తెరమీదకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ వచ్చిన వెంటనే అప్పటి ప్రభుత్వం ఆ ప్రభుద్దుడి అక్షతన జర్నలిస్టుల సంక్షేమం పెడితే జర్నలిస్టుల జీవితశలు ఆగం చేశాడు. తెలంగాణ జర్నలిస్టుల గోస పుచ్చుకున్నాడు. ఆంద్రప్రదేశ్ లో జగన్ అధికారంలో రాగానే అక్కడ ప్రత్యక్షమై సలహాదారుడయ్యాడు.‌ ఇప్పుడు మళ్లీ మేకవన్నె వేషాలేయడానికి వస్తున్నట్లు తెలుస్తోంది. గత నలబై సంవత్సరాలుగా కొత్త తరం జర్నలిస్టులకు అవకాశాలు రాకుండా,  తమకే పదవులు అని అనుభవిస్తూ,కూర్చున్న కొమ్మే నరికే కుహనావాదుల పట్ల జాగ్రత్త సుమీ...!

బాక్స్:

*_యాడ్స్ ఆపేయడమే కాదు._*
_* ఇన్నేళ్ల వందల కోట్ల 'యాడ్స్ స్కాం' తవ్వాలి_

రేవంత్ ప్రభుత్వం నమస్తే తెలంగాణకు యాడ్స్ ఆపేసింది. అందరికీ ఇచ్చిన సిక్స్ గ్యారంటీలు, ప్రజాపాలన, అభయహస్తం బాపతు యాడ్స్ అందులో రాలేదు. నిజానికి రేవంత్ ప్రభుత్వం చేయాల్సింది మరో కీలకాంశం ఉంది. అసలు ఏ పత్రిక సర్క్యులేషన్ ఎంత..? ఏ టీవీ చానెల్ వ్యూయర్‌షిప్ ఎంతో తేల్చాలి. ఏబీసీ లేదా ఐఆర్ఎస్. ఏదో ఒక న్యూట్రల్ ప్రొఫెషనల్ సర్వే ఫలితాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. పత్రికల సొంత సర్టిఫికెట్లను, సీఎ మదింపుల్ని చెత్తబుట్టలో పడేయాలి. టీవీలకు రేటింగ్స్ ప్రతివారం బార్క్ ఇస్తుంది. ఇన్నేళ్ల ప్రభుత్వ యాడ్స్ కలిపి లెక్కేసి చూస్తే కొన్ని వేల కోట్ల స్కాం ఇది.

వాటిని బట్టి టారిఫ్ రివైజ్ చేయాలి. నమస్తే తెలంగాణ మాత్రమే కాదు. కొన్ని చిన్న పత్రికలు పేరుకు ఐఅండ్‌పీఆర్ అధికారులకు పంపించడం కోసమే ఓ వందా రెండొందల కాపీలు కొట్టి అడ్డగోలుగా యాడ్స్ కొట్టేసేవాళ్లు. టీవీ చానెళ్లకు ఇచ్చే యాడ్స్‌కు లెక్కాపత్రం ఏమీ లేదు. జాతీయ స్థాయిలో తన పేరు వెలిగిపోవడానికి ఏవేవో భాషల్లో ఉన్న పత్రికలకూ వందల కోట్లు తగలేశాడు కేసీయార్. కేవలం ఆ యాడ్స్ కమీషన్ల కోసం అప్పటికప్పుడు ‘యాడ్ ఏజెన్సీలు’ పుట్టు కొచ్చాయి. తెలుగు కదా, అవి పలువురు పీఆర్ఓల బినామీ ఏజెన్సీలు. అదొక పెద్ద దందా. దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. అలా చేస్తేనే కోట్ల ప్రజాధనానికి న్యాయం చేసినట్టు.. 'అబ్బే, అలా చేస్తే, ఓ పారదర్శక విధానం తీసుకొస్తే మా వెలుగు పత్రికకు కష్టం కదా.!' అంటారా..? ఏబీసీకి వెళ్లమనండి, తప్పేముంది..? అన్నట్టు… మీడియా అకాడమీ వేరు, జర్నలిస్టుల యూనియన్ వేరు. ఆ రెండింటి మధ్య ఓ బలమైన గీత ఉంటుంది. దాన్ని గౌరవించండి..!!

No comments:

Post a Comment