గల్ఫ్ జైలు నుంచి విడుదల కావాలంటే
భారతీయుడు అని నిరూపించుకోవాలి,
● సహాయం కోసం 'ప్రవాసీ ప్రజావాణి' తలుపు తట్టిన బాధితుడి కుటుంబ సభ్యులు,
● ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు లాంటి గుర్తింపు పత్రాలు లేవు,
● బ్యాంకు పాస్ బుక్, ఎల్ఐసీ పాలసీ, ఒక గ్రూప్ ఫోటో మాత్రం ఉన్నాయి,
నిర్మల్ జిల్లా: సోన్ మండలం మాదాపూర్, గ్రామానికి చెందిన ముండ్ల రాజన్న (59) అనే గల్ఫ్ కార్మికుడు 18 సంవత్సరాల క్రితం ఉపాధి కోసం యూఏఈ దేశంలోని దుబాయికి వెళ్ళి, అక్కడే ఉండిపోయాడు. మూడు నెలల క్రితం అక్కడి పోలీసుల తనిఖీల్లో అరెస్టయి అబుదాబి జైల్లో మగ్గుతున్నాడు. ముండ్ల రాజన్న, భారతీయుడు అని నిరూపించుకునేందుకు పాత పాస్ పోర్ట్ జీరాక్స్ గాని, ఇతర సాక్ష్యాలు గాని లేనందున యూఏఈ, దేశ రాజధాని అబుదాబి లోని ఇండియన్ ఎంబసీ తాత్కాలిక పాస్ పోర్ట్ (ఎమర్జెన్సీ సర్టిఫికెట్) జారీ చేయలేకపోతున్నది.
ఈ నేపథ్యంలో ముండ్ల రాజన్నను గల్ఫ్ జైలు నుంచి విడిపించి, భారత్కు తిరిగి తీసుకురావాలంటూ ఆయన భార్య ముండ్ల లక్ష్మి, కుమారుడు నితిన్, కుమార్తె నిఖిత లు ఇటీవల హైదరాబాద్ లోని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' వద్ద, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లను కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో హైదరాబాద్ పాస్ పోర్ట్ ఆఫీసర్ గా పనిచేసిన అనుభవం కలిగిన డా. వినోద్ వారికి మార్గదర్శనం చేశారు. ముండ్ల రాజన్నకు చెందిన అన్ని రకాల పత్రాలు, లిఖిత సాక్ష్యాలు (డాక్యుమెంటరీ ఎవిడెన్స్) సేకరించి దరఖాస్తు చేస్తే, పాస్ పోర్ట్ ఆఫీస్ లో రికార్డులు సెర్చ్ చేయించి పాత పాస్ పోర్ట్ వివరాలు రాబట్టి సహాయం చేస్తామని ఆయన వారికి సూచించారు.
ఈ మేరకు ముండ్ల రాజన్న భార్య లక్ష్మి అందుబాటులో ఉన్న ఆధారాలతో సోమవారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి మెయిల్ ద్వారా వినతిపత్రం పంపారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్, ఎంపీ గోడం నగేష్ లకు ప్రతులు పంపారు. అబుదాబి లోని తెలంగాణ సామాజిక కార్యకర్తలు గడ్చంద నరేందర్, ప్రియా సింగిరెడ్డి లు ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు. అబుదాబి లోని సామాజిక సేవకులు గడ్చంద నరేందర్ సెప్టెంబర్ లో సెలవుపై నిర్మల్ జిల్లాను సందర్శించిన సందర్భంగా, బాధిత కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఆయనకు వివరించారు. నరేందర్ అప్పుడే సమస్యను నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్ జిల్లా ప్రవాసీ హెల్ప్ లైన్ నిర్వాహకులు, కార్మిక శాఖ అధికారి ముత్యం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మంద భీంరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ప్రత్యేక చొరవ తీసుకొని, జీఏడి ఎన్నారై విభాగం ద్వారా ప్రయత్నాలు ప్రారంభించిందని అన్నారు. హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో రికార్డుల శోధన, నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా వ్యక్తి గుర్తింపు ధృవీకరణ, అబుదాబి లోని భారత దౌత్య కార్యాలయం ద్వారా మద్దతు కోసం ఏక కాలంలో మూడు కార్యాలయాలకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా లేఖలు రాసే విధంగా తాము కృషి చేస్తున్నామని భీంరెడ్డి వివరించారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా వారి కష్టాల్లో పాలు పంచుకుంటామని, ఆదుకుంటామని ఆయన అన్నారు.