Friday, January 19, 2024

ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా.... సీఎం రేవంత్ స్నేహితుడు....?

*ప్రభుత్వ    ప్రధాన సలహాదారుగా.... సీఎం రేవంత్ స్నేహితుడు....?*

*ముఖ్యమంత్రి రేవంత్‌ నీడలో బాధ్యతలు*

*16 ఏళ్లుగా ఇద్దరి మధ్య స్నేహబంధం* 

*ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మండవ*

*ఇద్దరు నేతలకు క్యాబినెట్‌ హోదా*

*మంత్రివర్గ సమావేశాలకూ మండవ?*
హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి దక్కే అవకాశాలున్నాయి. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి నిర్వహించే కార్యక్రమాలు అన్నింటినీ వెనుక నుంచి వేంనరేందరే పర్యవేక్షించే వారు. ఆయన టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. రేవంత్‌తో నరేందర్‌కు దాదాపు 16 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. టీడీపీలోనూ ఇద్దరూ కలిసే ఉన్నారు. 2004-2009 మధ్యలో వేం నరేందర్‌రెడ్డి మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా రేవంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఉభయ సభల్లో చురుగ్గా ఉండే టీడీపీ యువనేతలిద్దరి మధ్య స్నేహబంధంబలపడింది. 2009లో నియోజకవర్గాల పునర్‌ విభజనతో వేంనరేందర్‌ నిర్మించుకున్న రాజకీయదుర్గం మహబూబాబాద్‌ రిజర్వ్‌డ్‌ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే 2015లో మిత్రుడు వేం నరేందర్‌ను ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో భాగంగానే నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్‌సన్‌ వద్దకు రేవంత్‌ వెళ్లారు. అనంతర కాలంలో రేవంత్‌ ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లలో నరేందర్‌ తన వెన్నంటే ఉన్నారు. తర్వాత ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచీ పలు కార్యక్రమాల్లో నరేందర్‌ కీలకంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలి ఎన్నికల సమయంలోనూ పీసీసీ అధ్యక్షుడి ప్రచారంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడంతో నరేందర్‌కు కీలక పదవిని ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలనే దిశగా కసరత్తు నడుస్తున్నట్టు తెలుస్తోంది. క్యాబినెట్‌ హోదాతో ఈ పదవిని ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రధాన సలహాదారు పదవి అయితేనే సీఎంకు దగ్గరగా ఉండడంతో పాటు అవసరమైనకార్యకలాపాలను పర్యవేక్షించే చాన్స్‌ ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

*మండవకు ప్రణాళిక సంఘం*

సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయనకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవిని ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడికి క్యాబినెట్‌ హోదా ఉంటుంది. ఆ హోదాతో ఆయన్ను మంత్రివర్గ సమావేశాలకు ఆహ్వానించే అవకాశం ఉంది.

*V.S. జీవన్*

No comments:

Post a Comment