*శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు....రంగంలోకి ఈడీ*
హైదరాబాద్: హెచ్‌ఎండీఏ మాజీ సంచాలకుడు శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. అతనిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌తో పాటు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలు ఇవ్వాలని ఈడీ అధికారులు ఏసీబీని కోరారు.వివరాలు వచ్చిన అనంతరం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల విలువ సుమారు రూ.13 కోట్లు కాగా.. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.250 కోట్లకు పైనే ఉంటుందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రాథమిక అంచనా. ఏసీబీ 8 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించగా.. అతడి దందాలు మరిన్ని బహిర్గతమయ్యాయి. తన అక్రమ ఆదాయాన్ని ఎక్కువగా స్థిరాస్తుల కొనుగోళ్లకే వెచ్చించినట్లు తేలింది. శివబాలకృష్ణతోపాటు కుటుంబసభ్యులు, బినామీల పేరిట మొత్తం 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్లు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో తేలింది. మరోవైపు మూడు రోజులపాటు హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్న దస్త్రాల్ని ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పలు స్థిరాస్తి సంస్థలకు బాలకృష్ణమంజూరు చేసిన అనుమతులపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది.
*V.S. జీవన్*
No comments:
Post a Comment