Thursday, February 1, 2024

హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్

హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్

🚦భవిష్యత్తు అవసరాలకు సమగ్ర ప్రణాళిక 

🚦సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయి పెంపు

🚦సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకాలు

🚦మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లను ప్రోత్సహించే కొత్త విధానం  

🚦హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula

గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.

హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచించారు. అందులో నిపుణులైన కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలన్నారు.  


పెరిగిన వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని సమావేశంలో చర్చకు వచ్చింది. స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. మూడు నెలల్లోగా ఈ నియామకాలు జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. కొత్తగా నియమించిన వారికి తగిన శిక్షణనివ్వాలని సూచించారు. ఈలోపు వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోం గార్డులను ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలని. తక్షణమే వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. 


ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో (పీక్ అవర్స్లో) లా అండ్ ఆర్డర్ పోలీసులను గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటికి సరిపడే సంఖ్యలో సిబ్బంది నియామకాలు చేపడుతామని సీఎం చెప్పారు. 


సిటీలోని అన్ని ప్రధాన జంక్షన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది తప్పకుండా అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కేవలం ఆటోమేటిక్  సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకూడదని అన్నారు. టూ వీలర్ ట్రాఫిక్ ఇంటర్సెప్టర్స్ పై (ద్విచక్ర వాహనాలపై) ఎస్ఐలు, కానిస్టేబుళ్లను పంపించి ట్రాఫిక్ జామ్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 


పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రధాన రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎల్బీ నగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే లను ఎక్కడెక్కడ నిర్మించాలి... అక్కడున్న సాధ్యాసాధ్యాలను గుర్తించాలని సీఎం అన్నారు.


హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమిషనర్లు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతినెలా తప్పనిసరిగా సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులను సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


పార్కింగ్ సమస్యను అధిగమిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోతాయనే చర్చ జరిగింది. వీలైనన్ని చోట్ల మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని, పార్కింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వ పరంగా రాయితీలు ఇవ్వాలని సీఎం అన్నారు. అన్ని విధివిధానాలతో ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలని సీఎం ఆదేశించారు.


లే అవుట్లకు హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చేటప్పుడు అక్కడ రోడ్లు, పార్కులు, మౌలిక వసతులకు ఎంత స్థలం కేటాయించాలనే ప్రమాణాలు పున: పరిశీలించాలని సీఎం ఆదేశించారు. విశాలమైన రోడ్లు ఉండేలా దేశంలోని ఇతర నగరాలు, విదేశాల్లో ఎలాంటి పద్దతులను అనుసరిస్తున్నారో పరిశీలించాలని సీఎం సూచించారు. 


హైదరాబాద్ లో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఆ ఏరియాలో ఉండే ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, డీజీపీ శ్రీ రవి గుప్తా, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శ్రీ శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ రోనాల్డ్ రాస్, ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీ షానవాజ్ ఖాసీం, అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్ శ్రీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ సీపీ శ్రీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ శ్రీ సుధీర్ బాబు, ట్రాఫిక్ డీసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1752721089254539625?t=0YNoueuGiEWqaT4QcMUHAA&s=19

No comments:

Post a Comment