Saturday, February 3, 2024

నందమూరి తారకరామారావు... సచివాలయం

నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు సచివాలయంలోని అయిదు/ ఆరవ అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళడానికి ప్రత్యేకం గా ఒక లిఫ్ట్ ఉండేది. ఆయన లిఫ్ట్ దగ్గరకు రాగానే భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన అన్ని లిఫ్టు లను ఆపేసే వారు. ఎన్టీఆర్ గారు తన ఆఫీస్ లోపలకు వెళ్ళి కుర్చీలో కూర్చున్న తరువాతే లిఫ్టు లు మళ్ళీ పని చేసేవి.
ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఒకే ఉద్యోగి లిఫ్టు ఆపరేటర్ గా ఉండేవాడు. ఆ కారణంగా అతనికి ఎన్టీఆర్ గారితో కొంచెం చనువు ఉండేది. ఎన్టీఆర్. గారు కూడా అతనిని రోజూ చూస్తుంటారు కాబట్టి నవ్వుతూ బాగున్నావా అని అడిగేవారు.
ఒకరోజు ఎన్టీఆర్ గారు  ఆఫీస్ లో ఉండగా సాయంత్రం ఆ ఉద్యోగి ఆఫీస్ లోకి వెళ్ళి నమస్కారం చేశాడు. ఆ సమయం లో అప్పటి సభాపతి, మరి కొందరు ఆయనతో పాటు ఉన్నారు. ఎన్టీఆర్ గారు ఆశ్చర్యంగా అతణ్ణి చూసి "ఏమిటి?" అని అడిగాడు.
"సార్..నేను ఈ సాయంత్రం తో రిటైర్ అవుతున్నాను. మా యూనియన్ వారు చిన్న పార్టీ ఇస్తున్నారు. చివరి సారిగా మీకు చెప్పి వెళదాం అని వచ్చాను సర్" అని  చెప్పాడు లిఫ్ట్ ఆపరేటర్.
ఎన్టీఆర్ గారు ఆశ్చర్యంగా చూసి " అరే..పొద్దున్న చెప్పలేదే? ఉండు" అని తన కార్యదర్శులకు ఫోన్ చేసి అర్జెంట్ గా ఒక శాలువా, బోకే తెమ్మని ఆదేశించారు. ఈ లోపల ఆ ఉద్యోగి కుటుంబ వివరాలను అడిగారు. అతనికి సొంత ఇల్లు లేదని, పెళ్ళి కావలసిన కుమార్తెలు ఉన్నారని తెలుసుకుని సెక్రెటరీ ని పిలిచి ఆ ఉద్యోగి పేరుతో ఒక ప్రభుత్వ స్థలం ఉన్న ప్రాంతం లో రెండు ఎకరాల భూమి కీ పట్టా కాగితాలు అరగంట లోపల సిద్దం చెయ్యమని ఆదేశించారు.
ఇంతలో శాలువా, బోకే, స్వీట్స్ వచ్చాయి, వెంటనే
ఎన్టీఆర్ గారు ఆ లిఫ్ట్ ఆపరేటర్ ను  స్వయంగా సన్మానం చేసి, తన జేబులోంచి కొంత నగదు తీసి ఇంటి పట్టా కాగితాలతో సహా అందించి, అవసరం అయితే కలవమని చెప్పి పంపించారు. తాను ఏమాత్రం ఊహించని ఈ పరిణామానికి ఆనందబాష్పాలురాలుస్తూ వెళ్ళిపోయాడు ఆ ఉద్యోగి.  ప్రచారానికి నోచుకోని ఇలాంటి కోణాలు ఎన్.టి.రామారావు గారి పాలనలో ఎన్నో ఉన్నాయి...

No comments:

Post a Comment