Sunday, February 25, 2024

#ధరణి దరఖాస్తులకు మోక్షం

#ధరణి దరఖాస్తులకు మోక్షం

✅ పెండింగ్ దరఖాస్తులకు వెంటనే పరిష్కారం

✅ మార్చి మొదటి వారంలోనే తగిన ఏర్పాట్లు

✅ మెరుగైన రెవిన్యూ రికార్డుల నిర్వహణకు చట్ట సవరణ

✅ ధరణి పోర్టల్ ఏజెన్సీపై సమగ్ర విచారణకు ఆదేశం

ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల పెండింగ్ కేసులున్నాయి. వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఏమేం మార్గాలున్నాయని ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వీటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, మార్చి మొదటి వారంలోనే అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

ఈరోజు సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవిన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు శ్రీ ఎం. కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ రేమండ్ పీటర్, అడ్వకేట్ శ్రీ సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ శ్రీ బి. మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీ శేషాద్రి, ప్రాజెక్టు డైరెక్టర్ సీఎంఆర్వో శ్రీ వి. లచ్చిరెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్నారు.

2020లో అమల్లోకి వచ్చిన ఆర్వో ఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. గత ప్రభుత్వం మూడు నెలల్లో హడావుడిగా చేపట్టిన రెవిన్యూ రికార్డుల నవీకరణతో నే కొత్త చిక్కులు వచ్చాయని చెప్పారు. ఆ రికార్డులనే ధరణికి ప్రామాణికంగా తీసుకోవటంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని అన్నారు. దీంతో లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ దాకా వెళ్లాల్సి వస్తుందని వివరించారు. దాదాపు 35 మాడ్యుల్స్ ద్వారా ధరణి డేటాలో ఉన్న తప్పులను సవరించుకునేందుకు రెవిన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఏ మాడ్యుల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కమిటీ సీఎం దృష్టికి తీసుకెళ్లింది.

లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందని తెలిపారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవిన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని చర్చ జరిగింది. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలో జమ చేయటంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని చర్చ జరిగింది. ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్ వో ఆర్ చట్టం చేయటం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు.

కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూముల రికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైతే చట్ట సవరణ చేయటం లేదా.. కొత్త చట్టం తీసుకు వచ్చే అంశాలను పరిశీలిద్దామని చెప్పారు. ధరణిలో ఇప్పుడున్న లోపాలు, సమస్యలన్నీ మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీకి సూచించారు. ఎలాంటి భూవివాదాలు, కొత్త చిక్కులు లేకుండా దోషరహితమైన భూముల రికార్డులను నిర్వహించాలని సీఎం అన్నారు. అందుకు అవసరమైన పరిష్కారాలను కూడా అన్వేషించాలని కమిటీని కోరారు. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పుడున్న పెండింగ్ దరఖాస్తుల్లో సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 

ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్ఏ అధ్వర్యంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ఈ పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల భూముల రికార్డులు మొత్తం విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన భూముల డేటాను, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఏజెన్సీ దగ్గర ఉంచటాన్ని ముఖ్యమంత్రి తప్పు బట్టారు. భూముల రికార్డుల డేటాకు భద్రత ఉందా.. సురక్షితంగా ఉన్నట్టా.. లేనట్టా.. అని అనుమానాలు వ్యక్తం చేశారు.

2018లో టెక్నికల్, ఫెనాన్సియల్ బిడ్డింగ్, అర్హతల ఆధారంగా ఐఎల్ ఎఫ్ఎస్ అనే కంపెనీకి అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ డిజైన్ డెవెలప్​మెంట్​ ను అప్పగించిందని అధికారులు బదులిచ్చారు. ఆ కంపెనీ దివాళా తీసిందని, తర్వాత టెర్రాసిస్ అని పేరు మారటం, డైరెక్టర్లు అందరూ మారిపోవటం, తర్వాత వాటాలు అమ్ముకొని ఫాల్కాన్ ఇన్వెస్టెమెంట్ కంపెనీగా చేతులు మారటంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

బిడ్ దక్కించుకున్న కంపెనీ తమ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని, ఏకంగా కంపెనీలనే మార్చితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. భూముల రికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి, విదేశీ కంపెనీలకు కూడా అప్పగించే నిబంధనలున్నాయా.. అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

2018లో రూ.116 కోట్లకు ధరణి టెండర్ దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు పన్నెండు వందల కోట్లకు అమ్ముకోవటం విస్మయం కలిగించిందని సీఎం అన్నారు. మన రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున.. విలువైన భూములను పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ధరణి పోర్టల్ నిర్వహణపై నియంత్రణ, అజమాయిషీ లేదా.. అని సీఎం రెవిన్యూ అధికారులను ప్రశ్నించారు.

Courtesy / Source by :

https://twitter.com/TelanganaCMO/status/1761397134769750208?t=XHrVWVqLdA5H80rg2SgFJQ&s=19

No comments:

Post a Comment