*_నేడు, రేపు రాష్ట్రంలో అతి భారీవర్షాలు..!!_*
_బంగాళాఖాతంలో అల్పపీడనంతో_ _తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన_
_ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 7 సెం.మీ వర్షపాతం_
_ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ_
_తెలంగాణ : రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అతిభారీ వర్షాలు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మలుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది._
*_ములుగు జిల్లాలో అత్యధిక వర్షపాతం_*
_రాష్ట్రంలో గురువారం ములుగు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 7 సెం.మీ, ఖమ్మం జిల్లా తల్లాడలో 6 సెం.మీ, మంచిర్యాల జిల్లా వెన్నంపల్లిలో 6 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లిలో 5 సెం.మీ, కుమరం భీం అసిఫాబాద్ జిల్లా దహెగావ్ లో 5 సెం.మీ, సిర్పూర్ లో 5 సెం.మీ, మంచిర్యాల జిల్లా కొటపల్లిలో 5 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా దోర్నకల్ లో 5 సెం.మీ, కుమరం భీం జిల్లా బెజ్జూరులో 5 సెం.మీ, ఖమ్మం జిల్లా వైరా లో 4 సెం.మీ ల చొప్పున వర్షాపాతం నమోదైంది._
*_వాయుగుండంగా మారే అవకాశం_*
_తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తదుపరి 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా పయనిస్తూ, శుక్రవారం దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి వాయవ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. బలపడిన ఈ వాయుగుండం ఈ నెల 27న దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది._
No comments:
Post a Comment