*_రేవంత్ యు టర్న్..!_*
_# హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మళ్లీ మలుపు_
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత,9440000009)_
హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇన్నాళ్లు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఒక్కసారిగా స్టాండ్ మార్చడం జర్నలిస్టు వర్గాల్లో ఆవేదనకు కారణమైంది. ముఖ్యంగా జవహర్‌లాల్ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ (జేఎన్‌జే) సభ్యుల ఆశలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి.
*_18 ఏళ్ల నిరీక్షణకు బ్రేక్.?_*
ఏళ్ల తరబడి డబ్బులు చెల్లించి, స్థలాల కోసం పోరాడుతున్న జేఎన్‌జే సభ్యులు ఇప్పుడు మళ్లీ మొదటి దశకు చేరిన పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ హయాంలో కేటాయించిన రెండు స్థలాలపై ఆశలు పెట్టుకున్నా, సుప్రీంకోర్టు తీర్పుతో అవి రద్దయ్యాయి. దీంతో “ఇన్నాళ్ల పోరాటం వృథా అయిందా?” అనే ప్రశ్న ఉత్కంఠగా మారింది.
*_లీగల్ మార్గాలు మూసుకుపోయినట్టే.!_*
సుప్రీంకోర్టు తీర్పుతో:
పాత కేటాయింపులు రద్దయ్యాయి. ఈ భూములు ప్రభుత్వానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంది. నాటి జర్నలిస్టులు చెల్లించిన డబ్బుపై అనిశ్చితి నెలకొంది. ఈ విషయంలో ప్రభుత్వంపై జర్నలిస్టుల్లో “నమ్మక ద్రోహం” అన్న భావన బలపడుతోంది.
*_కొత్త ఫార్ములా… సొసైటీలకు చెక్!_*
తాజా ప్రకటనలో సీఎం స్పష్టం చేసిన విషయంలో
సొసైటీలకు వేరుగా కేటాయింపులు ఉండవు.
అర్హులైన జర్నలిస్టులందరికీ ఒకేసారి కేటాయింపు చేయాలనే ప్రతిపాదన పలు ఆలోచనలకు తావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇవ్వాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
*_పీటముడి_*
“అందరూ కలిసి ప్రతిపాదనలు ఇవ్వండి. లేకపోతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది” అని సీఎం హెచ్చరిక స్వరంలో పేర్కొన్నారు. దీంతో జేఎన్‌జేకు షాక్ ఇచ్చినట్లు అయింది. ఈ నిర్ణయం వల్ల మిగతావారికి ఆశ కలిగింది. జేఎన్‌జే సొసైటీ
ఇప్పటివరకు “ముందు మాకు న్యాయం” అన్న డిమాండ్ పక్కకు వెళ్లిపోయి, అందరినీ ఒకే వరుసలో నిలబెట్టిన పరిస్థితి ఏర్పడింది.
*_అర్హులెవరు.?_*
సిఎం రేవంత్ రెడ్డి ప్రకటన కొత్త వివాదానికి నాంది పలికినట్లయింది.
ఇప్పుడు ప్రధాన ప్రశ్న...
18 ఏళ్ల క్రితం సభ్యులేనా అర్హులు.?
లేక ఇప్పటి వరకు వచ్చిన జర్నలిస్టులందరా.?
ప్రింట్, టీవీ, వెబ్, డిజిటల్ రంగాల జర్నలిస్టులందరినీ ఎలా గుర్తిస్తారు.? ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
*_పాత భూములపై ఫుల్ స్టాప్_*
పేట్ బషీరాబాద్, నిజాంపేట వంటి కీలక భూములను ఇవ్వడం లేదని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో పాత కేటాయింపులపై ఆశలు పూర్తిగా చెదిరిపోయినట్టే.
ఈ సమావేశంలో క్లారిటీ లేదు. ప్రెస్ క్లబ్ అంశంపై జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులు సీఎంను కలిశారు.
అయితే సొసైటీలకు ఇస్తారా? వ్యక్తులకు ఇస్తారా? అన్న కీలక ప్రశ్నకు స్పష్టత రాలేదు.
*_చివరి జంజాట మాటలు_*
ఇది ఇప్పుడు కేవలం హౌజింగ్ సమస్య కాదు.! ఇది పాత హక్కులు vs కొత్త విధానం. ఇది న్యాయం × సమానత్వం
ఒకవైపు 18 ఏళ్ల పోరాటం.! మరోవైపు అందరికీ సమాన న్యాయం అనే వాదన. మొత్తం మీద... 'రేవంత్ యు టర్న్'తో హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య మళ్లీ మొదటికి చేరింది. పరిష్కారం మాత్రం ఇంకా దూరంగానే కనిపిస్తోంది.!
No comments:
Post a Comment