Friday, June 13, 2025

నగర పోలీసు వాహనాలపై ఈ_ చలానాలు జారీ

*ట్రాఫిక్ కు పోలీస్ బకాయి.... రూ.68 లక్షలు*

*నగర పోలీసు వాహనాలపై ఈ_ చలానాలు జారీ*

హైదరాబాద్ సీటీ... హైదరాబాద్ నగర పోలీస్ విభాగానికి చెందిన వాహనాలు సైతం ఎడాపెడా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయివీటిని ట్రాఫిక్‌ విభాగం అధికారులు గుర్తించి జారీ చేసిన ఈ-చలాన్ల బకాయిలు భారీగానే ఉన్నాయి. ఈ జరిమానాల చెల్లింపు విషయంలో మాత్రం ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. రహదారి నిబంధనలపై అవగాహనకు కృషి చేస్తున్న నగరవాసి లోకేంద్ర సింగ్‌ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలను వెలుగులోకి తెచ్చారు. పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ-చలాన్లలో ఇప్పటికీ 17,391 పెండింగ్‌లో ఉన్నాయి. వీటి జరిమానా మొత్తం రూ.68 లక్షలని లెక్క తేలింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 210 బీ ప్రకారం ఆ చట్టాన్ని అమలు చేసే ఏ అధికారికి సంబంధించిన వాహనమైనా ఉల్లంఘనకు పాల్పడితే... సాధారణ జరిమానాకు రెట్టింపు విధించే అవకాశం ఉంది. ఆ కోణంలో లెక్కిస్తే జరిమానా మొత్తం రూ.1.36 కోట్లుగా పరిగణించవచ్చు. నగరంలోని రహదారులపై ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను పోలీసు విభాగం ఈ-చలాన్ల రూపంలోనే జరిమానా విధిస్తోంది. చౌరస్తాలతోపాటు ఇతర కీలక ప్రాంతాల్లో ఉన్న కెమెరాలు, క్షేత్ర స్థాయిలో ఉండే పోలీసులు ఆ ఉల్లంఘనలను ఫొటోలు తీస్తారు.

*ఆటోమేటెడ్‌ కెమెరాలు గుర్తించి..*
సాధారణంగా క్షేత్ర స్థాయి సిబ్బంది తమ విభాగానికి చెందిన వాహనాలు చేసే ఉల్లంఘనలపట్ల చూసీచూడనట్లుగా వ్యవహరిస్తారు. అవి కంట పడినప్పటికీ ఫోటోలు తీయరు. అయితే ఓవర్‌ స్పీడింగ్‌ వంటి ఉల్లంఘనల్ని ఆటోమేటెడ్‌ కెమెరాలు గుర్తించి ఫొటోలు తీస్తాయి. దీంతో పోలీసు వాహనాలపైనా ఈ-చలాన్లు జారీ అవుతున్నాయి. ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సర్వర్‌కు ఆర్టీఏ డేటాబేస్‌ అనుసంధానించి ఉంటుంది. దీని ఆధారంగా ఆయా వాహన చోదకుల రిజిస్టర్డ్‌ చిరునామాలకు ఈ-చలాన్లు, రిజిస్టర్డ్‌ మైబెల్‌ నెంబర్లకు ఎస్సెమ్మెస్‌లు వెళ్తాయి. అయితే పోలీసు విభాగానికి సంబంధించిన వాహనాలు అన్నీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ) పేరుతోనే రిజిస్టరై ఉంటాయి. దీంతో ఈ ఈ-చలాన్లు కూడా ఆ పేరుతోనే జారీ అవుతాయి. ఆ వాహనం ఎవరు వినియోగిస్తున్నారో వారి చిరుమానాలు రికార్డుల్లో ఉండవు. ఈ కారణంగానూ పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ-చలాన్లలో అత్యధికం పెండింగ్‌లో ఉండిపోతున్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ ఈ-చలాన్లను అన్ని రకాలైన ఉల్లంఘనలకు సంబంధించి ఉన్నాయని తెలుస్తోంది.

*ఓవర్‌ స్పీడ్‌పైనే ఎక్కువ..*
ఓవర్‌ స్పీడింగ్‌, రాంగ్‌ పార్కింగ్‌ తదితర ఉల్లంఘనలపై జారీ అయినవి ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వాహనాలపై గరిష్టంగా 15 చలాన్లు పెండింగ్‌లో ఉండగా... వీటిలో కొన్ని 2017 నాటివి కావడం గమనార్హం. అత్యంత ప్రముఖుల వాహనాలకు పైలెటింగ్‌, ఎస్కార్ట్‌ చేస్తున్న, ఆయా కాన్వాయ్‌లను అనుసరిస్తున్న పోలీసు వాహనాలు పరిమితికి మించిన వేగంతోనే ప్రయాణించాల్సి వస్తుంది. ఈ కారణంగానూ కొన్నింటిపై ఈ-చలాన్లు జారీ అవుతున్నాయి. కాగా, గత ఏడాది ట్రాఫిక్‌ విభాగం అధికారులు మొత్తం 56.3 లక్షలు ఈ-చలాన్లు జారీ చేశారు. వీటిలో 46.6 లక్షలు చలాన్లకు సంబంధించిన జరిమానాను వాహన చోదకులు చెల్లించారు.

ఇప్పటి వరకు జరిమానాలు చెల్లించనివి 17 వేలకుపైనే

సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన విషయాలు

*V.S.జీవన్*

No comments:

Post a Comment