అదనపు వరి పండించడమేలా ?
ఆక్షన్ పెట్టి అమ్మడమేలా ?
Courtesy / Source by :
కన్నెగంటి రవి, రైతు
స్వరాజ్య వేదిక,
ఫోన్ : 9912928422
-----------------------------------------------
తెలంగాణా రాష్ట్రంలో రైతుల నుండీ 2022 వానాకాలం (55 లక్షల టన్నులు ) , 2022-2023 యాసంగి సీజన్ (65 లక్షల టన్నులు ) లలో సేకరించిన సుమారు కోటీ 10 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని గ్లోబల్ టెండర్లు పిలిచి బహిరంగ మార్కెట్ లో అమ్మాలని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ధాన్యం అమ్మకం ధర ఇంకా నిర్ణయించలేదు కానీ , ఆ వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రక్రియలో తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసిన కంపెనీలకు లాభమూ, తక్షణ భారం దించుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఉపశమనమూ లభించవచ్చు కానీ, దీర్ఘ కాలంలో వివిధ కోణాలలో రాష్ట్రం తీవ్రంగా నష్ట పోబోతున్నది. ఈ ధాన్యం అమ్మకాల వల్ల , రైతులకు అదనంగా వచ్చే లాభమేమీ ఉండక పోగా, భవిష్యత్తులో బియ్యం వినియోగదారులకు మాత్రం భారమే మిగులుతుంది.
రైతుల నుండీ ప్రభుత్వం ధాన్యాన్ని కొనేశాక , వాటిని ఏం చేసుకుంటే మనకెందుకు ? అని అనిపించవచ్చు . బిల్లుల భారం లేకుండా, ఉచిత విద్యుత్ రైతులకు అందుతున్నప్పుడు, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు అప్పులలో కూరుకు పోతే మాత్రం మనకెందుకు? అని గతంలో కొందరిలాగే వ్యాఖ్యానించారు.
రైతుల నుండీ ధాన్యం సేకరించిన పౌర సరఫరాల శాఖ అప్పుల్లో కూరుకుపోయినా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసే డిస్కం లు అప్పుల్లో కూరుకుపోయినా అధికార పార్టీకీ , రాష్ట్ర ప్రభుత్వానికీ వచ్చే తక్షణ నష్టం ఏమీ లేదు . ఆ ఆర్ధిక భారాన్ని భవిష్యత్తులో మోయవలసినది రాష్ట్ర ప్రజలే. నిజానికి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకు పోకుండా కాపాడడం , అందుకు బడ్జెట్ నుండీ అవసరమైన నిధులను ప్రతి సంవత్సరం కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత .
కానీ సంక్షేమ పథకాల పేరుతో రాజకీయ ప్రయోజనం పొంది, వచ్చే ఎన్నికలలో ప్రజల ఓట్లు కొల్ల గొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలనే యావలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వం తన పాలనా బాధ్యతలను పూర్తిగా మర్చిపోయింది. ఆయా సంస్థలను నష్టాల పాలు చేసింది.
CACP సంస్థ అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2022 -2023 లో క్వింటాలు ధాన్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు (C2) 1877 రూపాయలు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం కనీస మద్ధతు ధర కు చట్టబద్ధత కల్పిస్తే , తెలంగాణ రైతులకు క్వింటాలుకు 2815 రూపాయలు మద్ధతు ధర అందాలి.
కానీ ఈ సిఫారసును అమలు చేయకుండా, 2022 లో కేంద్రం ధాన్యానికి ప్రకటించిన కనీస మద్ధతు ధర క్వింటాలుకు 2060 రూపాయలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బడ్జెట్ నుండీ అదనపు బోనస్ ఏమీ ఇవ్వలేదు. ప్రతి క్వింటాలుపై తెలంగాణ రైతులు నష్ట పోయింది 755 రూపాయలు . అంటే గత రెండు సీజన్ లలో రాష్ట్రం సేకరించి,ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో అమ్మాలనుకుంటున్న కోటి టన్నుల ధాన్యం పై రైతులు నష్ట పోయింది 7550 కోట్ల రూపాయలన్నమాట. ఒక ఎకరం వరి ధాన్యం పండించే రైతుకు నికర నష్టం 18,120 రూపాయలన్నమాట.
కేంద్రం ప్రకటించిన MSP అయినా గత రెండు సీజన్ లలో రైతులకు పూర్తిగా చెల్లించారా ? చెల్లించలేదు. తేమ ఎక్కువుందనే పేరుతో , ధాన్యం నల్లబడి నాణ్యత లేదనే పేరుతో సేకరణ సంస్థలు, రైస్ మిల్లర్లు , ధాన్యం రైతుల నుండీ ప్రతి క్వింటాలుపై 10 శాతం కోత పెట్టి కొన్నారు . ఫలితంగా రైతులకు ప్రతి క్వింటాలుకు నికరంగా దక్కిన ధర కేవలం 1800-1900 రూపాయలు మాత్రమే.
అంటే రాష్ట్రంలో కోటి టన్నుల సేకరణలో క్వింటాలుకు 200 రూపాయల చొప్పున రైతులకు జరిగిన నష్టం 2000 కోట్ల రూపాయలన్నమాట. కేంద్రం MSP ప్రకటనలో చేసిన మోసం వల్లా, ధాన్యం సేకరణలో చేసిన అన్యాయం వల్లా రైతులు మొత్తం కోటి టన్నులపై 9550 కోట్ల రూపాయలు నష్టపోయారన్నమాట.
రైతులకు ఇంత నష్టం చేసి , ఇప్పుడు గ్లోబల్ టెండర్లు పిలిచి ధాన్యం అతి తక్కువ ధరలకు మార్కెట్ లో అమ్మడం వల్ల వ్యాపారులకు తప్ప , నిజంగా ప్రభుత్వానికి , ప్రజలకు, రైతులకు ఏమైనా లాభం ఉందా?
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సంస్థ ప్రతి మనిషికి ఆరోగ్యం కోసం రోజుకు నాలుగు వందల గ్రాముల ఆహార ధాన్యాలు అవసరమని సిఫారసు చేసింది. అంటే నెలకు 12 కిలోలన్నమాట . ఇందులో సగం ( 6 కిలోలు) రేషన్ కార్డులపై బియ్యంగా సరఫరా చేసినా, మిగిలిన సగం జొన్నలు, ఇతర చిరు ధాన్యాల రూపంలో తక్కువ ధరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే చిరు ధాన్యాల పంటలను రైతుల నుండీ సేకరించడానికి ఆహార బధ్రత చట్టం కింద కేంద్రం అనుమతించి, ఆర్ధికంగా కూడా సహకరిస్తుంది . కర్ణాటక లాంటి రాష్ట్రాలు చాలా కాలంగా ఈ పద్ధతిని అమలు చేస్తున్నాయి.
దీనివల్ల కేవలం వరి ధాన్యం పండించే రైతులకే కాకుండా , చిరు ధాన్యాలు పండించే రైతులకు కూడా కనీస మద్ధతు ధరలు దక్కుతాయి. పప్పు ధాన్యాలను, నూనె గింజలను కూడా అలా రైతుల నుండీ మద్ధతు ధరలకు సేకరించి ప్రజలకు తక్కువ ధరలకు సరఫరా చేయవచ్చు. అప్పుడే వరి మాత్రమే కాకుండా ఈ అన్ని పంటలనూ రైతులు పండిస్తారు.
కానీ ఇవాళ తెలంగాణ లో ఒక మనిషికి నెలకు 6 కిలోల వరి బియ్యం తప్ప, రేషన్ కార్డులపై మరేమీ సరఫరా చేయడం లేదు. ఫలితంగా కుటుంబానికి అవసరమైన అదనపు బియ్యాన్ని పేదలు , ఇతర వినియోగదారులు ఎక్కువ ధరలకు మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. ఇది వ్యాపారులకు లాభం, వినియోగదారులకు భారంగా పరిణమించింది.
ప్రపంచ ఆకలి సూచీలో భారత దేశం 121 దేశాలలో 107 వ స్థానంలో ఉంది. ప్రజలకు అవసరమైన పౌష్టిక ఆహారం దొరకక పోవడం వల్ల, మహిళలలో, పిల్లలలో రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 వ రౌండ్ నివేదిక కూడా బయట పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో 15-49 సంవత్సరాల మధ్య వయస్సు గర్భిణీ స్త్రీలలో 53.2 శాతం మంది, 15-49 సంవత్సరాల మొత్తం మహిళలలో 57.6 శాతం మంది మహిళలు రక్త హీనత తో బాధ పడుతున్నారని ఈ నివేదిక బయట పెట్టింది. అంటే ప్రజలకు కడుపు నిండా ఆహారం దొరకడం లేదని అర్థం.
ఈ స్థితిని నివారించడానికి గ్రామీణ, పట్టణ పేదలకు నెలకు మనిషికి ఆరు కిలోలు కాకుండా, 12 కిలోల బియ్యాన్ని సరఫరా చేయవచ్చు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయడం లేదు.
ఇవాళ బహిరంగ మార్కెట్ లో నాణ్యమైన సన్న బియ్యం ధర కిలో 55 నుండీ 60 రూపాయలు పలుకు తున్నాయి. రైతుల నుండీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి ఆ బియ్యాన్ని పట్టణాలలో మధ్యతరగతి కుటుంబాలకు రైతు బజార్ల ద్వారా కిలో 35-40 రూపాయల చొప్పున అందించేందుకు అవకాశం ఉంది. రైతు బంధు కార్పొరేషన్ ద్వారా ఈ పని చేస్తామని గతంలో జీవో కూడా ఇచ్చిన ప్రభుత్వం ఆ పని కూడా చేయడం లేదు. కానీ బహిరంగ మార్కెట్ లో ధాన్యం అమ్మకానికి సిద్ధమైంది.
అసలు మన రాష్ట్రం ఇంత ఖర్చు పెట్టి మన అవసరాలకు మించి, వరిని పండించాల్సిన అవసరం ఉందా ? ఒక మనిషికి నెలకు 12 కిలోలు, సంవత్సరానికి 144 కిలోలు బియ్యం అవసరం. వలస కార్మికులతో సహా, రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఉన్నారనుకుంటే సంవత్సరానికి 57,60,000 టన్నుల బియ్యం కావాలి. ఇందుకు అవసరమైన ధాన్యం ఎకరానికి 24 క్వింటాళ్ల దిగుబడి చొప్పున సుమారు 86,40,000 టన్నులు. ఈ ధాన్యం పండించడానికి సంవత్సరానికి అవసరమైన సాగు భూమి కేవలం 36 లక్షల ఎకరాలు మాత్రమే. ఈ ధాన్యం రెండు సీజన్ ల లోనూ పండించుకునే అవకాశం ఉంది .
కోటి ఎకరాల మాగాణం పేరుతో, ప్రభుత్వం రైతులను వరి వైపు నెట్టడం వల్ల 2020 నుండీ మన రాష్ట్ర అవసరాలకు మించి మొత్తం రెండు సీజన్ లలో కలిపి కోటి ఎకరాలకు పైగా వరి సాగవుతున్నది. ఉచిత విద్యుత్ ఇచ్చి, రైతు బంధు పెట్టుబడి పెట్టి పండించిన ఈ ధాన్యాన్ని పూర్తిగా FCI కొనే అవకాశం లేదు. పండిన పంటను కొంత కాలం దాచుకోవడానికి గ్రామ స్థాయిలో గిడ్డంగుల సౌకర్యం లేదు. ఈ నేపధ్యంలో స్థానికంగా అమ్ముకోలేక గ్లోబల్ టెండర్ లు పిలిచి అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది.
వరి సాగు విస్తీర్ణం పెరగడం అనేక పర్యావరణ సమస్యలను కూడా సృష్టిస్తున్నది. రసాయన ఎరువుల వినియోగం పెరిగి భూములు నిస్సారమైపోతున్నాయి. గ్రీన్ హౌజ్ వాయువులు ముఖ్యంగా గాలిలో మిథేన్ విపరీతంగా పెరుగుతున్నది. కలుపు , పురుగు విషాల వినియోగం పెరిగి ఆహారం పూర్తిగా విష పూరితమైపోతున్నది. వరి సాగు కోసం చేసే లోతు దుక్కులు, దమ్ము, మొత్తం సాగు భూములను ఇతర పంటల సాగుకు పనికి రాకుండా చేస్తున్నాయి. వరిలో అత్యధిక నీటి వినియోగం వల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతున్నది.
మరో వైపు ఆరోగ్యానికి అవసరమైన పౌష్టిక విలువలు అందించే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు రాష్ట్రంలో తగినంత ఉత్పత్తి కావడం లేదు. ఇవన్నీ బయట ప్రాంతాల నుండీ మన రాష్ట్రం లోకి దిగుమతి అవుతున్నాయి. ఈ సరుకుల ధరలు కూడా పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందనంత ఎత్తున ఉంటున్నాయి .
అన్ని పంటలనూ చంపేసి, వరిని ప్రోత్సహించి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ లో వేలం వేయడమేమిటి ? అన్యాయంగా లేదూ ..
ఈ దశలో తెలంగాణ ప్రభుత్వమూ, రైతులూ కూడా తెలంగాణ లో వరి సాగు విస్తీర్ణం పై సీరియస్ గా ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన సందర్భమిది.