Wednesday, May 7, 2025

*పహల్గాంలో ఐదోతనాన్ని కోల్పోయిన**ఆడపడుచులకు ప్రతీక ‘ఆపరేషన్‌ సిందూర్‌’*

*పహల్గాంలో ఐదోతనాన్ని కోల్పోయిన*
*ఆడపడుచులకు ప్రతీక ‘ఆపరేషన్‌ సిందూర్‌’*
- దేశం జోలికొస్తే సహించేది లేదు
- అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమే
- బిజెపి జాతీయ నాయకులు పొంగులేటి
- ఆపరేషన్‌ సిందూర్‌ విజయం పట్ల హర్షం
- పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు నేతృత్వంలో పూజలు
- సైన్యానికి, మోడీకి ఆశీస్సుల కోసం సాయిబాబా గుడిలో యాగం
- జన గణన, కుల గణన అంశంపై అవగాహన సదస్సు
పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణాలను కోల్పోయిన 26మంది హిందువుల కుటుంబీకుల ఐదాతనానికి ఆపరేషన్‌ సిందూర్‌ నిదర్శనమని భారతీయ జనతా పార్టీ తమిళనాడు, కర్ణాటక సహ ఇన్‌చార్జ్‌, మాజీ శాసన మండలి సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వైరా నియోజకవర్గ కేంద్రంలోని కామిశెట్టి ఫంక్షన్‌హాల్‌లో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కుల గణన, జనగణన అవగాహన సదస్సుకు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తొలుత వైరా పట్టణంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దేశ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నరేంద్ర మోడీతో పాటు, దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తూ ఆపరేషన్‌ సిందూర్‌ లాంటి కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న సైనికులకు మనోధైర్యంతో పాటు, ఆశీస్సులు అందించాలని ప్రత్యేకంగా యాగం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం వైరా అయ్యప్ప ఆలయంలో  దేశ రక్షణ కోసం దీవెనలు అందించాలని కోరుతూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కామిశెట్టి ఫంక్షన్‌హాల్‌లో పార్టీ నూతన మండల అధ్యక్షుడు మనుబోలు వెంకట క్రిష్ణ అధ్యక్షతన జరిగిన జనగణన, కుల గణన అవగాహన సదస్సులో ప్రసంగించారు. దేశ పౌరుల జోలికొస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధం అనేలా ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు ఉన్నాయని, ముఖ్యంగా పహల్గాం దాడి జరిగిన వారంలోనే ఆపరేషన్‌ సింధూర్‌ కార్యక్రమం నిర్వహించి, 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి దేశ సత్తా చాటారని మోడీ ప్రభుత్వంతో పాటు, భారత సైనికులను అభినందించారు. ముఖ్యంగా పహల్గాం దాడిలో హిందువులా ముస్లీంలా అని గుర్తించి మరీ హత్యాకాండను కొనసాగించిన ఉగ్రవాదులకు ఆపరేషన్‌ సిందూర్‌ చెంపపెట్టులాంటిదని, అవసరమైతే ఈ విషయంలో యుద్ధానికి కూడా వెనకాడే ప్రసక్తే లేదనేది మోడీ సంకల్పంగా అభివర్ణించారు. పాకిస్తాన్‌తో పాటు ఆదేశానికి సహకరిస్తున్న చైనా, శ్రీలంక దేశాలు కూడా బుద్దిగా ఉండాలని, లేనిపక్షంలో తీవ్ర మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ  జనగణన, కులగణనలాంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు, ఆపరేషన్‌ సిందూర్‌లాంటి ప్రతీకార కార్యక్రమాలకు కూడా భారత్‌ వెనుకాడబోదనే సంకేతాలు ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ పౌరుల సంరక్షణ కోసం భారత రక్షణశాఖ చేస్తున్న కృషిని కొనియాడారు. మోడీని స్ఫూర్తిగా తీసుకొని బిజెపి శ్రేణులు ప్రణాళికాబద్ధంగా పార్టీ అభివృద్ధికి, దేశ సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలుత కామిశెట్టి కళ్యాణ మండపం వద్ద నరేంద్రమోడీ, భారత సైనికుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం దేశ రక్షణ కోసం.. సైనికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని పార్టీ శ్రేణులతో పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. జిల్లా నుండి నూతనంగా నియమితులైన 10 మండలాల అధ్యక్షులను ఈ సందర్భంగా బిజెపి జాతీయ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావులు శాలువాలతో సత్కరించి, ఘనంగా సన్మాంచారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత అభివృద్ధికి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సన్నె ఉదయ్‌ ప్రతాప్‌, గోంగూర వెంకటేశ్వర్లు,నున్నా రవి కుమార్‌, మందడపు సుబ్బారావు, అల్లిక అంజయ్య, దొడ్డా అరుణ, మణి, రజిని రెడ్డి,పమ్మి అనిత, వీరవెల్లి రాజేష్‌, నల్లగట్టు ప్రవీణ్‌ కుమార్,వీరు గౌడ్, రవి రాథోడ్‌, రేఖా సత్యనారాయణ, కొవ్వూరి నాగేశ్వరరావు, బట్టు వీరంరాజు,సరస్వతి, అంకతి పాపారావు తదితరులు పాల్గొన్నారు.
(Source)

No comments:

Post a Comment