*తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను దసరా వేళ కొందరు స్వార్థం కోసం ఇనుప బోనుల్లో బంధించారు*
*మూగప్రాణుల స్వేచ్ఛను హరిస్తూ, కాసుల వేటకు తెరలేపే అమానవీయ పోకడలను ఎవరూ ప్రోత్సహించవద్దు - హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ వి. సజ్జనార్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 21:
ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాల్సిన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను దసరా వేళ కొందరు స్వార్థం కోసం ఇనుప బోనుల్లో బంధించారు. మూగజీవులను హింసిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని మేం ముందుగానే స్పష్టంగా హెచ్చరించినప్పటికీ.. కొందరు పెడచెవిన పెట్టి ఆ నిస్సహాయ పక్షులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు అని హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ వి. సజ్జనార్ అన్నారు.అప్రమత్తమైన పౌరుల నుంచి అందిన పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు తక్షణమే స్పందించి, మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపి మొత్తం 4 పాలపిట్టలను ప్రాణాలతో కాపాడారు అని తెలిపారు.
లంగర్‌హౌస్ బాపుఘాట్ సమీపంలోని ఆలయం వద్ద ఇరుకైన బోనుల్లో నరకయాతన అనుభవిస్తున్న రెండు పాలపిట్టలను విడిపించి కేబీఆర్ పార్క్ అటవీ అధికారులకు అప్పగించగా.. ఛత్రినాక శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద చెట్టుకు బోను వేలాడదీసి నిర్బంధించిన ఒక పాలపిట్టను, అలాగే మంగళహాట్ బాలాజీనగర్ గుడి సమీపంలో బోనులో ఉంచిన మరో పాలపిట్టను రెస్క్యూ చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. బాధ్యులపై అటవీశాఖ సమన్వయంతో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
పండుగ పేరుతో ఒక నిస్సహాయ పక్షిని బంధించి, ఆహార నీళ్లు లేకుండా చిత్రహింసలకు గురిచేసి చూడటం ఎవరికీ మంచి చేయదు.. ఇది మన సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రాణభయంతో బోను చువ్వల మధ్య విలవిల్లాడుతున్న పక్షి రోదనలో శుభం ఎలా కనిపిస్తుంది? నిజమైన భక్తి అంటే జీవకారుణ్యమే తప్ప, ప్రకృతిని బందీ చేయడం కాదు!
మూగప్రాణుల స్వేచ్ఛను హరిస్తూ, కాసుల వేటకు తెరలేపే ఇలాంటి అమానవీయ పోకడలను ఎవరూ ప్రోత్సహించవద్దు. వన్యప్రాణులకు హాని తలపెట్టే ఘటనలు ఎక్కడ కనిపించినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని కోరుతున్నాం అని హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ వి. సజ్జనార్ అన్నారు.
No comments:
Post a Comment