Saturday, September 19, 2026

తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మల పాత్ర అనిర్వచనీయం - ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్_

*తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మల పాత్ర అనిర్వచనీయం - ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, సెప్టెంబర్ 17:

ఉప్పల్ బాగాయత్ లోని తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ విశ్వకర్మలు కేవలం సృష్టికర్తలే కాదు… నవనాగరికత, ప్రగతి చోదకులు అని అన్నారు.సబ్బండ వర్గాలకు, ఉత్పత్తి కులాలకు ఆరాధ్య దైవం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు
 మారుతున్న కాలానికి అనుగుణంగా చేతివృత్తుల్లో సాంకేతిక నైపుణ్యం, వ్యాపార మెళకువలు పెంచుకోవాలి. రాజకీయ చైతన్యంతోనే శాసన నిర్మాణంలో భాగస్వామ్యం, హక్కుల సాధన సాధ్యం.సృష్టి నిర్మాణానికే కాక నవనాగరికత, ఆధునిక ప్రగతికి విశ్వకర్మలే ఆద్యులని, సబ్బండ వర్గాలకు, సమస్త ఉత్పత్తి కులాలకు విశ్వకర్మ భగవానుడే మూలకారకుడని తెలంగాణ శాసనమండలి సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం / వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కీలక అంశాలను ప్రస్తావించారు:సృష్టికి మూలకారకులు: బ్రహ్మ ఆలోచన చేస్తే, ఆ ఆలోచనకు క్రియారూపం ఇచ్చి, జీవం పోసి సృష్టిని నిలబెట్టిన మహోన్నతుడు విశ్వకర్మ భగవానుడు. బంగారం, లోహం, చెక్క, శిల్పం, వస్త్రం ఇలా ఏ ఉత్పత్తి రంగమైనా సృష్టికి జీవం పోసింది విశ్వకర్మలేనని, సమాజంలోని సమస్త ఉత్పత్తి కులాలకు ఆయనే ఆరాధ్య దైవమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో విశ్వకర్మల పాత్ర అనిర్వచనీయం: తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకులు, బరిశెలు తయారు చేసి పోరాటానికి ఆయుధాలు సమకూర్చిన ఘనత విశ్వకర్మలదేనని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో 'తెలంగాణ జనసభ' ద్వారా వెయ్యికి పైగా సభలు పెట్టి ఉద్యమించిన మారోజు వీరన్న, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, ప్రాణత్యాగం చేసిన అమరుడు కాసోజు శ్రీకాంతాచారి, ఉద్యమంలో కీలకంగా నిలిచిన సిరికొండ మధుసూదనాచారి వంటి విశ్వకర్మ బిడ్డల పాత్ర ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు.వృత్తులపై దాడి – వ్యాపార మెళకువల ఆవశ్యకత: మార్కెట్ ఎకానమీ, సాంకేతిక మార్పుల వల్ల ఒకప్పుడు సమాజాన్ని శాసించిన విశ్వకర్మలు నేడు యాచన చేసే దుస్థితికి చేరడం బాధాకరమన్నారు. టాటాలు, బిర్లాల వంటి బహుళజాతి సంస్థల వ్యాపార ధోరణి వల్ల పుస్తెమెట్టెల నుంచి కలప పనుల దాకా సంప్రదాయ చేతివృత్తులన్నీ దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో 'కుబుసం' చిత్రంలో గోరేటి వెంకన్న రాసిన 'పల్లె కన్నీరు పెడుతుందో' పాట నాటి పరిస్థితి నుంచి నేటికీ గ్రామీణ చేతివృత్తుల బతుకుల్లో పెద్ద మార్పు రాలేదని గుర్తుచేశారు.విద్యతో పాటు విత్తం, రాజ్యాధికారం: విశ్వకర్మల వద్ద అపారమైన నైపుణ్యం, విద్య ఉన్నప్పటికీ, దానిని వ్యాపారంగా మార్చే యుక్తిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని స్వయంగా పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. విద్యకు విత్తం (ఆర్థిక శక్తి) తోడవ్వాలని, ఆ ఆర్థిక బలం రాజకీయ అధికారంగా మారినప్పుడే మన సమస్యలకు మనమే చట్టాలు చేసుకోగలమని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో ఉన్న నాయకులు రాబోయే రోజుల్లో శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు బాణాల నారాయణాచారి, ప్రధాన కార్యదర్శి నాగారం భాస్కరాచారి, కోషాధికారి మహేశ్వరం వేణుగోపాలాచారి, బీసీ ఉద్యమ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, భవన నిర్మాణ దాతలు బ్రహ్మశ్రీ జి.ఆర్. సూర్యరాజు, కుందారం గణేశాచారి, వేములవాడ మదన్మోహన్, బొడ్డుపల్లి సుందర్, వెంజమూరి రాఘవాచారి, బొడ్డుపల్లి రవి ప్రశాంతాచార్య, రాగిపల్లి రవీంద్రాచారి, ఎర్రోజు వేణుగోపాల్, దానకర్ణాచారి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment