*ప్రెస్ నోట్*
*తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి పిర్యాదు చేసినా స్పందించని పోలీస్ వ్యవస్థ*
*జూలై 12 దాడిపై చర్యలు తీసుకోకపోవడంతోనే 21న మళ్లీ దాడి?*
*చట్టాన్ని పక్కనపెట్టి నిందితులతో కుమ్మక్కైతే బాధితులకు రక్షణ ఎక్కడ?*
*వేముల శ్రీను - సామాజిక ఉద్యమకారుడు,రిపోర్టర్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, ఆగస్టు 26:
నల్లగొండ జిల్లా శాలి గౌరారం మండలం ఊటుకూరు గ్రామంలో తనపై వరుసగా జరుగుతున్న దాడులు, బెదిరింపుల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సామాజిక ఉద్యమకారుడు, రిపోర్టర్ వేముల శ్రీను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వేముల శ్రీను మాట్లాడుతూ.. జూలై 12న బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు తనపై దాడి చేసి తల పగలగొట్టారని, ఆ ఘటనపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తన ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేసి, వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిందితులతో కుమ్మక్కయ్యారనే అనుమానం తనకు కలిగిందన్నారు."జూలై 12న జరిగిన దాడిపై పోలీసులు కఠినంగా స్పందించి ఉంటే, అదే వ్యక్తులకు చట్టం అంటే భయం ఉండేది. కానీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడాన్ని అలుసుగా తీసుకొని, మళ్లీ ఆగస్టు 21న నాపై దాడి చేసి, చంపేందుకు ప్రయత్నించే స్థాయికి పరిస్థితి వెళ్లింది” అని వేముల శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒకసారి దాడి జరిగి బాధితుడికి గాయాలైన తర్వాత కూడా రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే దుండగులకు మరింత ధైర్యం వచ్చిందని ఆయన అన్నారు. పోలీసుల నిర్లక్ష్యం నిందితులకు అండగా మారితే సామాన్య ప్రజలు తమ ప్రాణాలను ఎవరిని ఆశ్రయించి కాపాడుకోవాలి? అని ప్రశ్నించారు.అంతేకాకుండా ఆగస్టు 21న జరిగిన దాడిపై ఆగస్టు 22న శాలి గౌరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, తన ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన పోలీసులు తనపైనే అక్రమంగా కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా స్టేషన్కు రావాలని ఎస్.ఐ. బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని తెలిపారు.
*“నాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. బాధితుడినైన నన్నే స్టేషన్కు పిలిచి బెదిరించడం ఏమిటి?*.
నిందితులకు చట్టం ఒకలా.. బాధితుడికి మరోలా ఉంటుందా?” అని వేముల శ్రీను ప్రశ్నించారు.భూ వివాదాన్ని అడ్డుపెట్టుకొని తనపై దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయని, తన కదలికలపై రెక్కీ నిర్వహించడం, వెంబడించడం వంటి చర్యలు కూడా చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని స్పష్టంగా చెబుతున్నప్పటికీ పోలీసులు తనకు రక్షణ కల్పించకుండా, తనపైనే ఒత్తిడి తీసుకురావడం తీవ్ర ఆందోళనకరమన్నారు.
*“పోలీసు స్టేషన్ న్యాయం జరిగే ప్రదేశంగా ఉండాలి..* సెటిల్మెంట్లకు, బెదిరింపులకు కేంద్రంగా మారకూడదు. బాధితుడిని రక్షించాల్సిన పోలీసులే బాధితుడిని భయపెడితే అది చట్టపాలన కాదు” అని వేముల శ్రీను ఘాటుగా వ్యాఖ్యానించారు.
జూలై 12న జరిగిన దాడి, ఆగస్టు 21న జరిగిన దాడి, తనకు వచ్చిన బెదిరింపులు, తనపై జరుగుతున్న ఒత్తిళ్లపై ఉన్నతాధికారులు స్వతంత్రంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసుల పాత్రపై కూడా విచారణ జరిపి, నిర్లక్ష్యం లేదా పక్షపాతం నిర్ధారణ అయితే బాధ్యులైన పోలీసు అధికారులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే తనపై జరిగిన దాడుల విషయంలో వర్తించే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, బాధితుడికి రక్షణ – నిందితులకు చట్టం అనే విధంగా పోలీసు వ్యవస్థ పనిచేయాలని వేముల శ్రీను డిమాండ్ చేశారు.
*“నా మీద ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా.. బెదిరింపులకు గురిచేసినా.. అన్యాయాన్ని ప్రశ్నించడం ఆపను*.
నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే ఇప్పటివరకు జరిగిన ప్రతి దాడి, ప్రతి బెదిరింపు, పోలీసుల వ్యవహారశైలి అన్నింటినీ విచారణలోకి తీసుకురావాలి” అని ఆయన స్పష్టం చేశారు.
No comments:
Post a Comment