Saturday, July 12, 2025

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

*స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి బీసీలంతా అండగా నిలవాలి*

*రిజర్వేషన్లను సవాలు  చేస్తూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే నిష్ణాతులైన న్యాయవాదులను నియమించి వాదనలు వినిపిస్తాం* 

*బీసీ రిజర్వేషన్లకు 9 వ షెడ్యూల్ లో చేర్చి చట్టబద్దత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి బీసీలంతా అండగా నిలవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కోరారు. అందరం కలిసి ఒక రక్షణ కవచంలా బీసీ రిజర్వేషన్లను కాపాడుకోవలసిన అవసరం ఉందని చెప్పారు.

మంత్రి కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, విప్ ఆది శ్రీనివాస్, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల ప్రతినిధులు వేర్వేరుగా ముఖ్యమంత్రిని కలిశారు.

వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. “బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతోనే ఇంతకాలం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశాం. నెల రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది.

రిజర్వేషన్లు 50 శాతానికి మించి పెంచరాదని గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసింది. ఆ చట్టంలో 50 శాతం గరిష్ట నిబంధనను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించాం. రిజర్వేషన్లను సవాలు  చేస్తూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే నిష్ణాతులైన న్యాయవాదులను నియమించి వాదనలు వినిపిస్తాం.

బీసీ రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలన్నా అందుకు సిద్ధంగా ఉన్నాం. నా చిత్తశుద్ధిలో లోపం లేదు.   మా నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు. అన్ని వర్గాలతో పాటు అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి అందరి అభిప్రాయాలను తీసుకున్నాం. కుల గణన డేటా వంద శాతం డిజిటలైజ్ చేశాం. భవిష్యత్తులో ఎవరూ ఛాలెంజ్ చేయడానికి వీలులేకుండా డేటాను భద్రపరిచాం.

సామాజిక న్యాయం చేయాలన్న లక్ష్యంతో ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమించి రాష్ట్రంలో కులగణన పూర్తి చేశాం. పక్కా ప్రణాళికతో పూర్తి పారదర్శకంగా, శాస్త్రీయంగా కులగణన పూర్తి చేశాం. ఏడాది కాలంలో ఈ ప్రకియ పూర్తి చేసి ఫిబ్రవరి 4 వ తేదీని సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించుకున్నాం.

కులగణన విషయంలో తెలంగాణ తీసుకున్న నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసింది. తెలంగాణలో కులగణన చేయడంతో ఆ ఒత్తిడికి లొంగి కేంద్రం 2026 లో జరిగే జన గణనలో కుల గణనను చేర్చించింది. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని కొందరు చేస్తున్న విమర్శలు అర్థం లేనివి.

బీసీ రిజర్వేషన్లకు 9 వ షెడ్యూల్ లో చేర్చి చట్టబద్దత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది” అని ముఖ్యమంత్రి  కుల గణన, రిజర్వేషన్ల అంశంపై సమగ్రంగా వివరించారు. రిజర్వేషన్లను కాపాడుకునే విషయంలో అన్ని ప్రయత్నాలు చేస్తూ, అందరం కలిసికట్టుగా పని చేద్దామని చెప్పారు.

*గంతల నాగరాజు(GNR)*

No comments:

Post a Comment