Thursday, October 22, 2026

తెలంగాణలో పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ₹2 కోట్లకు పెంపు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_

*తెలంగాణలో పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ₹2 కోట్లకు పెంపు - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

*ప్రాణ త్యాగం చేసిన వారి కుటుంబాల బాధలను పూర్తిగా తీర్చలేకపోవచ్చు. కానీ వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్ 21:

విడతలవారిగా నియామకాలు చేపడుతూ 2028 నాటికి పోలీసు శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేసి సిబ్బంది కొరత అన్నది లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పోలీసు అమరుల త్యాగాలను గౌరవిస్తూ, వారి ఆశయాలను కొనసాగిస్తూ శాంతియుతమైన, సురక్షితమైన, అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆహారం కల్తీ వంటి మారుతున్న నేర స్వభావాలు, సవాళ్లను ఎదుర్కోవడంలో పోలీసు శాఖను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
PoliceCommemorationDay సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అమరులకు నివాళులర్పించారు.పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, శాంతి భద్రతల ప్రాధాన్యత, పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.
“పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఎంతో భావోద్వేగమైన రోజు. సమాజం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరులకు నివాళులు. శాంతిభద్రతల పరిరక్షణలో వారి త్యాగాలను మరువలేనివి. అమరుల కుటుంబాలు ఒంటరి కాదు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది” అని ముఖ్యమంత్రి అన్నారు.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో 154 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేస్తూ, “వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేం. వారందరికీ హృదయపూర్వక నివాళులు. కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని” అన్నారు.
“ప్రాణ త్యాగం చేసిన వారి కుటుంబాల బాధలను పూర్తిగా తీర్చలేకపోవచ్చు. కానీ వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. పిల్లల చదువు, భద్రత విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటుంది” అని చెప్పారు.
“రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే పెట్టుబడులు ఒక్కటే సరిపోవు. రోడ్లు భవనాలు నిర్మిస్తే అభివృద్ధి కాదు. ప్రజలు నిర్భయంగా జీవించినప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెరగాలన్నా, ఐటీ, పర్యాటకం అభివృద్ధి చెందాలంటే.. శాంతిభద్రతల పరిరక్షణ ఎంతో ముఖ్యం. అందుకే ప్రజా ప్రభుత్వం పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.పోలీసు శాఖను బలోపేతం చేయడానికి 2025 అక్టోబర్ నాటికే దాదాపు 16 వేల మంది కానిస్టేబుళ్లు ఎస్‌ఐలను నియమించాం. సిబ్బంది కొరతను తగ్గించడానికి కొత్త నియామకాలు చేపడుతున్నాం. 2026లో పోలీస్ శాఖలో మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతించాం అని అన్నారు.విడతలవారిగా భర్తీ చేసుకుంటూ 2028 లోగా పోలీస్ శాఖలో అన్ని భర్తీ చేసి పోలీసు శాఖలో సిబ్బంది కొరత అన్నది  లేకుండా చేస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎన్నడూలేని విధంగా 112 మంది డీఎస్పీలను నియమించాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా ట్రాన్స్‌జెండర్స్‌ను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి వారి ఆత్మగౌరవాన్ని పెంచాం అని అన్నారు.
విధి నిర్వహణలో వీరమరణం పొందిన కానిస్టేబుళ్లకు గతంలో రూ. 40 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఉంటే దాన్ని ఏకంగా రూ. 1 కోటికి పెంచాం. హెడ్‌-కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలకు గతంలో రూ. 45 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ. 1 కోటికి పెంచాం. ఎస్‌ఐలకు రూ. 45 లక్షలు, ఇన్‌స్పెక్టర్లకు రూ. 50 లక్షలు ఉంటే దీనిని రూ. 1.25 కోట్లకు పెంచాం.డీఎస్పీ, అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారులకు రూ. 50 లక్షలు ఉంటే రూ. 1.50 కోట్లు పెంచాం. ఎస్పీ, ఐపీఎస్‌ అధికారులకు 1 కోటి రూపాయలు పరిహారం ఉంటే దానిని రూ. 2 కోట్లకు పెంచడం జరిగింది.ఇది కేవలం ఆర్థిక  సహాయం కాదు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం.  మరింత ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు వారి త్యాగాలను గుర్తించడం, వారి కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ తొలి ప్రాధాన్యత.అమరుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు, ఇంటి స్థలం ఉచిత విద్య, వైద్య సహాయం అందిస్తున్నాం. వైద్య విద్యలో ప్రత్యేక సీట్లను అమలు చేస్తున్నాం. భద్రత సంక్షేమ నిధి నుంచి రూ 16 లక్షలు, సంక్షేమ నిధి నుంచి మరో రూ. 8 లక్షల అందించాలని నిర్ణయించాం.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నాం. ఈ ఎక్స్‌గ్రేషియాను రూ. 10 లక్షలకు పెంచాలని డీజీపీని ఆదేశిస్తున్నా. హోంగార్డుల వైద్య పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలి. హోదా ఏదైనా ప్రతి ఒక్కరి కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తుంది.పోలీసు శాఖలో హోంగార్డు స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు వారి పిల్లలు చదువుకోవడానికి రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ప్రాంతంలో 44 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించాం” అని ముఖ్యమంత్రి వివరించారు.“డ్రగ్స్, గంజాయి వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. డ్రగ్స్ నియంత్రణలో EAGLE_TELANGANA పనితీరును, డీజీపీ గారిని అభినందిస్తున్నా అని అన్నారు.కల్తీ ఆహారంపై ఉక్కు పాదంతో అణచివేసేందుకు కొత్తగా c_tgsafe ను ప్రారంభించాం. అలాగే, షీ-టీమ్స్ hydsheteam సేవలను కొనసాగిస్తూ మహిళల భద్రతను మరింత బలోపేతం చేస్తున్నాం. మహిళలకు అండగా నిలవాలనే సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు ‘#StandWithHer’ కార్యక్రమాన్ని ఈ ఏడాది మార్చిలో ప్రారంభించాం. మహిళలు, పిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ రక్షణ అందించడానికి ఏప్రిల్‌లో స్పందన – తక్షణ రక్షణ బృందాలను ప్రారంభించాం” అని చెప్పారు.“పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీరు కోల్పోయిన వ్యక్తిని ఎవరూ తిరిగి తీసుకురాలేం. మీ కుటుంబాల్లో ఏర్పడిన లోటును ఎవరూ పూర్తిగా భర్తీ చేయలేరు. కానీ మీ బాధలో మీరు ఒంటరివారు కాదు. మీకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. పోలీసు శాఖ అండగా ఉంటుంది. తెలంగాణ సమాజం అండగా ఉంటుంది” అని భరోసానిచ్చారు.“ఈ రోజు పోలీసు శాఖలో పనిచేస్తున్న ప్రతి అధికారి, ప్రతి సిబ్బందికి ఒక మాట.. మీ క్రమశిక్షణే మీ బలం. మీ నిజాయితీయే మీ గౌరవం. ప్రజలకు మీరు అందించే భరోసాయే మీకు లభించే గొప్ప గుర్తింపు. ప్రజల భద్రతకు మీరు అండగా నిలవండి. మీ సంక్షేమానికి, మీ కుటుంబాల భవిష్యత్తుకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది.అమరులను గౌరవించడమంటే కేవలం నివాళులు అర్పించడం కాదు. అమరుల త్యాగాలను గౌరవించడం, వారి కుటుంబాలకు అండగా నిలవడం కూడా అంతే ప్రాధాన్యమైనవి.

FriendlyPolicing అమలు చేసే విషయంలోనే అసలు విషయం దాగి ఉంది. 

**సమస్య పరిష్కారమవుతుందని  పోలీసులపై నమ్మకంతో వచ్చే సామాన్యులతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలి. క్రిమినల్స్‌తో కఠినంగా వ్యవహరించాలి” అని ఉద్బోధించారు.** 

ఈ కార్యక్రమంలో TelanganaDGP సీవీ ఆనంద్ తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది అమరులైన పోలీసు కుటుంబాల సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు.

No comments:

Post a Comment