*ప్రెస్ రిలీజ్*
*రిమ్స్, ఆదిలాబాద్‌లో అగ్ని ప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువుల మృతిపై నివేదిక కోరిన టీజీహెచ్‌ఆర్‌సీ*
బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే,సెప్టెంబర్ 23:
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ TGHRC గౌరవ చైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో, 2026 సెప్టెంబర్ 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ RIMSలోని **స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ SNCU**లో సంభవించిన విషాదకర అగ్ని ప్రమాదానికి సంబంధించి పలు పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై కమిషన్ సుమోటోగా స్వీకరించింది.ఈ ఘటనపై
*(1)*: డెక్కన్ క్రోనికల్ లో “3 infants die of smoke after AC fire in RIMS baby unit”;
*(2)*: ది హిందూ లో “3 infants killed in fire accident at RIMS Adilabad: 25 rescued”;
*(3)*: ది టైమ్స్ అఫ్ ఇండియా లో “3 preterm infants die after blaze at RIMS in Adilabad”;
*(4)*: మన తెలంగాణ లో “రిమ్స్ లో అగ్ని ప్రమాదం”;
*(5)*: దిశ లో “ముగ్గురు నవజాత శిశువులు మృతి”;
*(6)*: నవ తెలంగాణ లో “ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాదం”;
*(7)*: సాక్షి లో “ఊపిరాడలె.. ప్రాణాలు నిలవలె”;
*(8)*: నమస్తే తెలంగాణ లో “అంతులేని విషాదం. ఆదిలాబాద్ రిమ్స్‌లో షార్ట్ సర్క్యూట్.. ముగ్గురు పిల్లల దుర్మరణం”;
*(9)*: ఈనాడు లో “చికిత్సకు వస్తే ప్రాణాలే పోయాయి” అనే శీర్షికలతో వచ్చిన వార్తలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది.వార్తా కథనాల ప్రకారం, ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌కు సంబంధించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి, SNCUలో దట్టమైన పొగ వ్యాపించింది. ఆ సమయంలో సుమారు 27 మంది నవజాత మరియు ముందస్తుగా జన్మించిన శిశువులు చికిత్స పొందుతున్నట్లు వార్తలు పేర్కొన్నాయి. ఈ ఘటన అనంతరం ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందగా, పలువురు శిశువులు పొగ మరియు శ్వాస సంబంధిత ఇబ్బందులకు గురైనట్లు, వారిని ఇతర వార్డులకు మరియు సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
అదేవిధంగా, SNCUలోని ఎయిర్ కండిషనింగ్ మరియు విద్యుత్ వ్యవస్థల నిర్వహణ, ఫైర్ అలారాలు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర తరలింపు ఏర్పాట్లు మరియు ఇతర అగ్ని భద్రతా చర్యలపై కూడా వార్తా కథనాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అగ్ని భద్రతా సన్నద్ధత మరియు విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో లోపాలు ఉన్నట్లు కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి.ఈ నేపథ్యంలో, అగ్ని ప్రమాదానికి దారితీసిన వాస్తవ పరిస్థితులు, శిశువుల మృతికి దారితీసిన కారణాలు, SNCUలో భద్రత మరియు నిర్వహణ ఏర్పాట్లు, ప్రమాద సమయంలో చేపట్టిన రక్షణ మరియు వైద్య చర్యలు, అలాగే ఈ ఘటనపై నిర్వహించిన విచారణకు సంబంధించిన అంశాలను నిర్ధారించుకోవడం అవసరమని కమిషన్ భావించింది.అందువల్ల, ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదికను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి సమర్పించాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, SNCUలో భద్రత మరియు నిర్వహణ ఏర్పాట్లు, ప్రభావిత శిశువుల రక్షణ మరియు చికిత్సకు తీసుకున్న చర్యలు, అలాగే ఘటనపై నిర్వహించిన విచారణలో వెలువడిన అంశాలను నివేదికలో పొందుపరచాలని కోరింది.ఈ వ్యవహారాన్ని తదుపరి పరిశీలన నిమిత్తం 27.10.2026కు వాయిదా వేసింది.
No comments:
Post a Comment