*బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశంలో శాంతి చర్చల కమిటీ చేసిన ప్రకటన*
గౌరవనీయులైన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలకు శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి,
గత మూడు నెలలుగా మేము స్థిరంగా కేంద్ర ప్రభుత్వానికి మరియు మావోయిస్టు పార్టీకి మధ్యన శాంతి చర్చలు జరగాలనీ, ఆయా ప్రాంతాల్లో శాంతి నెలకొని హింసాత్మక వాతావరణం శాశ్వతంగా తొలగిపోవాలని ప్రయత్నం చేస్తున్నాం. గత నెల 24 న మేము ఆ విధంగా ఇరుపక్షాలకూ విజ్ఞప్తి చేయటం, తదనంతరం మావోయిస్టు పార్టీ సానుకూలంగా స్పందించటం మొదలగు విషయాలు మీకు తెలిసినవే. దేశ ప్రధాన మంత్రి గారికీ, హోం మంత్రి గారికీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకూ శాంతి చర్చలకు సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ మేము ఈపాటికే లేఖలను కూడా పంపి ఉన్నాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను స్వయంగా కలవడానికి మేము అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనల్లో కొంత ఆశాజనకమైన స్పందన కనిపిస్తున్నది. ప్రధానంగా ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ద్వారా మాత్రమే శాంతి చర్చల ప్రక్రియ మరింత ముందుకు వెళ్ళగలదని నమ్ముతూ, ఆ లక్ష్య సాధనకై జాతీయ స్థాయిలో శాంతికాముకులతో ఏర్పడిన కమిటీ ద్వారా తగిన కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాము.
ఈ కాలంలో కూడా చతిస్గడ్ లోనూ , జార్ఖండ్ లోనూ జరుగుతున్న సాయుధ దాడుల్లో మావోయిస్టులు, ఆదివాసీలు చనిపోతూనే ఉన్నారు. ప్రభుత్వ సాయుధ బలగాలలోని కొంతమంది వ్యక్తులు కూడా క్షతగాత్రులవుతున్న వార్తలు చూస్తున్నాము.
ఇక నిన్నటి నుండి చత్తీస్గడ్, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రి గుట్టలలో వందలాది మంది మావోయిస్టులు షెల్టర్ తీసుకుంటున్నారని తెలిసి, సిఆర్పిఎఫ్, కోబ్రా మరియు తెలంగాణ నుండి గ్రేహౌండ్స్ దళాలు వారిని చుట్టుముడుతున్నట్టు వస్తున్న వార్తలు మమ్మల్ని కలవరపెడుతున్నాయి. ఇది తప్పకుండా మరింత పెద్దఎత్తున మానవ ప్రాణ నష్టం, మారణహోమాలకు దారి తీయగలదని మేము ఆందోళన చెందుతున్నాం. ఎంతో కాలంగా కొనసాగుతున్న ఈ హింసాత్మక వాతావారణం తొలగిపోయే విధంగా ఒక శాశ్వత, శాంతియుత పరిష్కార మార్గానికి సహకరిస్తామనే ఆశాజనకమైన ప్రకటనలు మావోయిస్టుల నుండి వస్తున్న ఈ తరుణంలో పాత, కక్షాపూరిత విధానాన్నే అవలంభించటం రాజనీతిజ్ఞులైన పాలకుల లక్షణం కాదని ప్రభుత్వ పెద్దలకు తెలియనిది కాదు. ఈ సమస్యకు మీ రాజనీతిజ్ఞత ద్వారా ఒక శాంతియుత, రాజకీయ పరిష్కారాన్ని కనుగొనటానికి మీకు కూడా ఇదొక సదవకాశమని మేము నమ్ముతున్నాము. కేంద్ర ప్రభుత్వానికీ, తెలంగాణ మరియు చత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వాలకు మా అత్యవసర విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి కర్రిగుట్టల అడవుల్లో, బస్తర్ లో, జార్ఖండ్ లో ఈ యుద్ధ వాతావరణ పరిస్థితిని నివారించండి.
అలాగే, మావోయిస్టులతో శాంతి చర్చల కోసం నిర్దిష్ట కాలపరిమితితో అయినా కాల్పుల విరమణ ప్రకటించి, ఇతర సానుకూల వాతావరణం ఏర్పర్చి శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించాలని మిమ్మల్ని కోరుతున్నాము.
ఇది రాజ్యాంగాన్నికి లోబడి, ప్రజాస్వామ్య బద్ధంగా జీవనం సాగించే మాలాంటి స్వతంత్ర పౌరుల అత్యవసర, ప్రత్యేక విజ్ఞప్తి మాత్రమే కాక, ఇది అశేష ప్రజల ఆకాంక్షగా కూడా భావించి మానవతా దృక్పథంతో ఇందుకు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం. అలాగే నిన్న జమ్మూ కాశ్మీర్ లో 28 మంది పర్యాటకుల పైన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
–– జస్టిస్ బి. చంద్రకుమార్
( రిటైర్డ్ హై కోర్టు న్యాయమూర్తి)
చైర్మన్
*పీస్ డైలాగ్ కమిటీ.*
జంపన్న, పీస్ కమిటీ వైస్ చైర్మన్.
K. ప్రతాప్ రెడ్డి,ఫ్రీడం, ఫైటర్ & రచయిత.
ప్రో, జీవన్ కుమార్ HRF అధ్యక్షుడు.
సీహెచ్. బాలకిషన్ రావు, PUCL ప్రెసిడెంట్.
ప్రో, వినయ్ రెడ్డి, పీస్ కమిటీ వైస్ చైర్మన్.
డా,తిరుపతయ్య, HRF సెక్రెటరీ.
చలపతి రావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ CCM.
గుర్రం వినయ్ కుమార్ సీపీఐ (ఎంఎల్) CCM.
హన్మేశ్ సీపీఐ (ఎంఎల్).
జానకిరామ్ RSP నాయకులు.
టీ తిరుమల్, సీనియర్ జర్నలిస్ట్
No comments:
Post a Comment