Monday, November 18, 2024

_# వందల కోట్ల విలువైన 225 ఎకరాలు అక్రమార్కుల పాలు_

_ఏవండీ కిషోర్ కుమార్.!_
*_'ఇష్టమొచ్చినట్లు కట్టబెట్టేశారు.!_*

_# వందల కోట్ల విలువైన 225 ఎకరాలు అక్రమార్కుల పాలు_
_# విజయనగరం జిల్లాలో జేసీ కిశోర్‌కుమార్‌ నిర్వాకం_
_# ఈ వైకాపా ప్రభుత్వ హయాంలో చెలరేగిన వైనం_
_# ఎన్డీయే సర్కారు సీరియస్‌_
_# విచారణ నివేదికను అనుసరించి చర్యలు_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*https://epaper.mediatodaydaily.in/view/736/18-11-2024*

*_ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన ఐఏఎస్‌ అధికారి వాటిని అక్రమార్కులకు కట్టబెట్టారు. అర్జీదారుల దరఖాస్తుల్లోని వాస్తవాలపై విచారణ జరపకుండా... అధికారిక దస్త్రాల్ని పరిశీలించకుండా.. కిందిస్థాయి అధికారుల నివేదికలు కోరకుండా.. నిబంధనల్ని ఉల్లంఘించి మరీ నిర్ణయాలు తీసుకున్నారు. వందల కోట్ల రూపాయల విలువైన 225 ఎకరాలను అక్రమార్కులకు ధారదత్తం చేశారు. విజయనగరం జిల్లాలో మూడేళ్ల కిందట జేసీగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి కిశోర్‌కుమార్‌ నిర్వాకమిది. ప్రస్తుతం ఆయన ‘మిషన్‌ ఫర్‌ క్లీన్‌ కృష్ణాగోదావరి కెనాల్స్‌’ ఎండీగా ఉన్నారు. విజయనగరం జిల్లా జేసీగా ఉన్నప్పుడు భోగాపురం, కొత్తవలస, బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, దత్తిరాజేరు, జామి మండలాల్లో విలువైన ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు కట్టబెట్టారు. వైకాపా పాలనలో ఇష్టానుసారం రెచ్చిపోయిన కిశోర్‌కుమార్‌... తన హోదాకు కళంకాన్ని తెచ్చారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోరుతూ... 2022 మార్చి 17న విజయనగరం జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ‘జాయింట్‌ కలెక్టర్‌/సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ ప్రభుత్వ భూములను పరిరక్షించాలి. సరైన విచారణ జరపకుండా, దస్త్రాలు, దస్తావేజులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా భూముల విషయంలో ఆదేశాలు ఇచ్చారు’ అని అందులో ఆమె పేర్కొన్నారు. కిశోర్‌కుమార్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు._*

*_అభియోగాలు నమోదు చేయాలి...:_*
ప్రభుత్వ ఆదేశాల మేరకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎ.బాబు 2022లో మే 25 నుంచి జూన్‌ 3 మధ్య విచారణ చేపట్టారు. ‘రికార్డుల పరిశీలన, బహిరంగ విచారణ లేకుండానే జేసీ కిశోర్‌కుమార్‌ కొందరికి భూములు కట్టబెట్టే విషయంలో అనుకూల ఆదేశాలిచ్చారు. ఐఏఎస్‌ సర్వీస్‌ నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించలేదు. జేసీగా ఉన్నప్పుడే కాకుండా.. ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా ఉన్న సమయంలోనూ కిశోర్‌కుమార్‌ ఇచ్చిన ఆదేశాలను జిల్లా కలెక్టర్‌ పరిశీలించాలి. ఆయనపై తీసుకునే చర్యలు అక్రమాలకు పాల్పడే ఇతర అధికారులకు గుణపాఠం కావాలి’ అని నివేదికలో ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ నివేదికపై తదుపరి చర్యలను వైకాపా ప్రభుత్వం తొక్కేసింది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ఆ తరహా దస్త్రాల్ని వెలికి తీస్తూ... బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. అప్పటి విజయనగరం ఆర్డీవో భవానీశంకర్, నలుగురు తహసీల్దార్లు రమణమ్మ, సురేష్, విజయభాస్కర్, నీలకంఠరావుపై క్రమశిక్షణ చర్యలకు గత వారం ఉత్తర్వులు వెలువడ్డాయి. విచారణ నివేదికను అనుసరించి కిశోర్‌కుమార్‌పై చర్యలు తీసుకోనున్నారు.

*_ఉల్లంఘనలు ఎన్నో...?:_*
    ఐఏఎస్‌ అధికారి బాబు విచారణ నివేదికను అనుసరించి జేసీ ఉల్లంఘనల తీరిదీ... సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌గానూ ఉన్న జేసీ కిశోర్‌కుమార్‌ ప్రొసీజర్‌ను అనుసరించకుండా నిషిద్ధ జాబితా నుంచి భూములు తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలిచ్చారు.
#    తహసీల్దార్‌కు వాట్సప్‌ ద్వారా ఆదేశాలిచ్చారు. అందులోనూ చివరి పేజీని మాత్రమే తహసీల్దార్లకు పంపారు. డిస్పాచ్‌ సెక్షన్‌ నుంచి ఇవి వెళ్లలేదు. అక్కడి సిబ్బంది ఈ విషయాన్ని చెప్పారు.
#    భూములను తహసీల్దార్లతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసినట్లు పేర్కొన్న తేదీలకు తగినట్లు వివరాలు లేవు.
#    రెండు సందర్భాల్లో మినహా ఆదేశాల జారీకి సంబంధించి క్లర్కులకు డిక్టేషన్‌ ఇవ్వలేదు.

*_దరఖాస్తు వచ్చిందే తడవుగా..:_*
భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో 20 ఎకరాలను గతంలో తమకు ప్రభుత్వం పంపిణీ చేసిందని మాజీ సైనికులు నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. ఎఫ్‌ఓసీ దస్త్రాల్లో భూములు ఇచ్చినట్లు నమోదుకాలేదు. అయినా 22-ఎ నుంచి తొలగింపుపై జేసీ ఆదేశాలిచ్చారు. నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీచేశారు.

*_విజ్ఞప్తిని పట్టించుకోకుండా..:_*
విజయనగరం మండలం జమ్ము నారాయణపురంలో చెరువు బందను(గయాల్‌) ప్రైవేటు వ్యక్తుల జిరాయితీ భూమిగా మార్చేశారు. ఈ గ్రామంలోనే  5.16 ఎకరాలను 22-ఎ నుంచి తొలగించి సోమేశ్వరరావు అనే వ్యక్తికి కట్టబెట్టారు. దత్తిరాజేరు మండలం లింగరాజుపాలెంలో పలువురికి 48.45 ఎకరాలకు సంబంధించి రైత్వారీ పట్టాలు జారీచేశారు.

*_నివేదికలు లేకుండానే...:_*
కొత్తవలస మండలం బలిఘట్టంలో దాదాపు 12 ఎకరాలు ఎస్టేట్‌ ఎబాలిష్‌ యాక్ట్‌ కింద నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయినా వీటిని ఒకరికి అప్పజెప్పారు. ఇందుకు సంబంధించి.. విజయనగరం ఆర్డీఓ, తహసీల్దార్‌ నుంచి విచారణ నివేదికలు లేకున్నా. ఉన్నాయని ఆర్డరులో పేర్కొన్నారు.

*_విమానాశ్రయ సమీపంలో...:_*
#    భోగాపురం మండలం గూడెపువలసలో 5.13 ఎకరాల గరుగుబిల్లివారి చెరువును ప్రైవేటు వ్యక్తుల జిరాయితీ భూమిగా మార్చేశారు. ప్రస్తుతం ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం సాగుతోంది. ప్రైవేటు వ్యక్తి చేతిలోకి మారిన ఈ భూమి విలువ ఇప్పుడు రూ.25 కోట్లకు పైగా పలుకుతోంది.
#    కొత్తవలస మండలం సంతపాలెంలో గతంలో పేదలకు ప్రభుత్వం డి-పట్టాలు పంపిణీ చేసింది. లబ్ధిదారుల నుంచి ఆ భూమిని వి.రవిరామరాజు అనే వ్యక్తి కొన్నారు. విచారణ చేపట్టకుండానే దరఖాస్తుదారునికి రైత్వారీ పట్టాను జారీచేశారు.
#    బొబ్బిలి మండలం గొర్లె సీతారామపురంలో 6.36 ఎకరాలు దరఖాస్తుదారు ఐవీ సీతాదేవి పేరిట రైతు వారీ పట్టా జారీచేశారు. ఇది ప్రభుత్వ భూమి అని రికార్డుల్లో నమోదై ఉన్నా పరిగణనలోకి తీసుకోలేదు.
#    ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురంలో 7.78 ఎకరాలను దుగ్గ దాలినాయుడుకు అప్పగించేశారు. ఇది పోరంబోకు రాళ్ల గుట్ట. గతంలో పేదలకు ప్రభుత్వ డి-పట్టాలిచ్చింది. వాటిని రద్దు చేసి జిరాయితీ భూమిగా మార్చేసి కట్టబెట్టేశారు. 
#    విజయనగరం గ్రామీణంలో 19 ఎకరాలు, మరో చోట 27.50 ఎకరాలను పువ్వాడ మధుసూదన్‌ పేరిట రాసిచ్చేశారు. ప్రభుత్వ రికార్డుల్లో పోరంబోకు రాళ్ల గుట్టలో గతంలో గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్నీ పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకున్నారు.
#    కొత్తవలస మండలం సంతపాలెంలో27 ఎకరాలను ప్రైవేటు వ్యక్తి చేతి(గయాల్‌ భూమి)కి అప్పగించారు. 
#    పూసపాటిరేగ మండలం కోనాడలో 1.23 ఎకరాకు, మరోచోట 2.62 ఎకరాలకు సంబంధించి వి.అప్పయ్యకు ప్రభుత్వం 1984లో డి-పట్టా ఇచ్చింది. వీటిని దంతులూరి రాధాదేవి కొనుగోలు చేశారు. ఆమె పేరుతో క్రమబద్ధీకరించారు.
#    భోగాపురం మండలం పోలిపల్లిలో 9.25 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల జిరాయితీ భూమిగా మార్చేశారు. వారికి రైతు వారీ పట్టాలు ఇచ్చేశారు. 
#    భోగాపురం మండలం రావాడలో వేర్వేరు సర్వే నంబర్లలోని 4.08 ఎకరాలు, 4.10 ఎకరాలు, 3.98 ఎకరాలు, 1.50 ఎకరాలను గతంలో పేదలకు డి-పట్టాలిచ్చారు. వారి నుంచి ఆ భూములను ఇతరులు వాటిని కొనుగోలు చేశారు. వారి పేరుతో జేసీ పట్టాలు ఇచ్చారు. జామి మండలం భీమసింగిలోని 4.54 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేశారు.

No comments:

Post a Comment