హిందూ మారణహోమం – కాశ్మీర్ ఫైల్స్ – ప్రజల చలనచిత్రం
ఒక జాతి మొత్తాన్ని కదిలించే శక్తి, ఒక సినిమాకి అరుదుగా లభిస్తుంది. కాశ్మీర్ ఫైల్స్ అది నిరూపించింది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి గారి హృదయవిదారకమైన వాస్తవిక హిందీ చిత్రం `కాశ్మీర్ ఫైల్స్’, ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు, ముఖ్యంగా కాశ్మీరీ హిందువుల హృదయాలను కలచివేస్తోంది. ఎక్కడో మనసు పొరల్లో అణగారిపోయిన బాధ, ఆక్రోశం పెల్లుబుకుతున్నాయి. సినిమా చూసినవారు చలించిపోతూ ఎపుడు తాము తమ ప్రియమైన మాతృభూమి కాశ్మీర్ వెళ్ళగలరో అని ఎదురుచూపులు చూస్తున్నారు.మారుమోగిన నిశ్శబ్దం
శతాబ్దాలుగా కాశ్మీరులో జరిగిన ఎన్నో `హిందూ నరసంహారాలలో’, 1980లు, 1990 కాలంలో జరిగినది ఇటీవలిది మాత్రమే. ఇదే కాలంలో, అయోధ్యలో బాబ్రీ మస్జిద్ పేరుతో ఉన్న వివాదాస్పద కట్టడం కూల్చడం, ఉగ్రవాదుల ద్వారా 1993 ముంబై అల్లర్లు జరిగాయి. అప్పుడు సోషల్ మీడియా లేకపోయినా, జాతీయ అంతర్జాతీయ మీడియాలు భారత దేశాన్ని, హిందువులను కావాలని అపఖ్యాతి పాలు చేస్తూ, ప్రపంచమంతా ఆ సంఘటనలు రచ్చకెక్కించారు, కాని భారతీయ మీడియా, కాశ్మీరు `హిందూ నరసంహారo’ గురించి మాత్రం భారతీయులకు చెప్పకుండా దాచిపెట్టింది. భారతీయ మీడియా 1947దేశ విభజన, స్వాతంత్ర్యం, హిందూ మారణకాండల గురించి కూడా ఇటువంటి మౌనమే పూర్తిగా పాటించింది, ఎవరూ వారి నోరు నొక్కిన దాఖాలాలు లేవు. అయినా కూడా, నేటికీ స్వాతంత్రోద్యమంలో పత్రికల పాత్ర అంటూ ఎందరో శ్లాఘిస్తుంటారు.
రాజకీయంగా కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. బహుశా అప్పటి హోంమంత్రి `ముఫ్తీ మహమ్మద్ సయీద్’ భారత ప్రథమ ముస్లిం హోంమంత్రి కావడం దానికి కారణమేమో? అయన తరవాత కాలంలో, మళ్ళి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి అయి, 2016లో పదవిలో ఉండగానే మరణించారు. కాశ్మీరు `హిందూ నరసంహారo’, భారత `రాజ్యం’, దాని వివిధ అంగాలు, భారత ప్రజలు, ముఖ్యంగా హిందువులు, ఎప్పటికీ చెరుపుకోలేని మచ్చ, రక్త చరిత్ర. హిందుస్తాన్‌లో ఎన్ని `హిందూ నరసంహారాలు’ జరిగినా, హిందువులు ఎప్పుడూ మౌనంగానే ఉంటారు, వారికి ఏమీ పట్టదు అనేది కూడా అంతే నిజం.
నెలలు, సంవత్సరాల, ఇస్లామియా జిహాదీ కార్యకలాపాలు; తరతరాల సత్సంబంధాలు, స్నేహాలు కాదని, హిందువులను వెలివేయడం, దాని పర్యవసానమైన జనవరి1990 కాశ్మీరు `హిందూ నరసంహారo’లో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ విశేషం ఇంకొకటుంది, కంటితుడుపు చర్యగా కూడా, ఎప్పుడూ ఎటువంటి విచారణ కమిషన్ గాని, కమిటి గాని, ట్రైబ్యునల్ గాని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఉగ్రవాదులకోసం అర్ధరాత్రి తలుపులు తీయగల భారత న్యాయస్థానాలు, కాశ్మీరీ హిందువుల ఆర్తనాదాల కేసులను వినడానికి నిరాకరించాయి, ఈ సంఘటనలు జరిగి చాలాకాలం అయింది అనే కారణాల చేత!
సినిమా – అనంతరం
దేశంలోని కాంగ్రెస్-వామపక్ష భావజాల `ఆవరణ వ్యవస్థ’- ఈ సినిమాకి సంబంధించిన వార్తాకధనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది, కొందరు సినిమా విడుదల ఆపేయాలని కోర్టులకెక్కారు, సెన్సర్ బోర్డు కొన్ని అర్ధంలేని కోతలు విధించింది. ఈ అడ్డంకులు దాటుకుని సినిమా థియేటర్లలో అడుగు పెట్టింది. మిగతా బాలీవుడ్ సినిమాలలాగా కాక, ఈ సినిమాకి కావలసినన్ని థియేటర్లు దొరకలేదు, మీడియా ప్రచారం లభించలేదు, ఓటిటి(OTT) ప్లాట్ఫార్మ్స్ దొరకలేదు.
మొదట్లో, మీడియా కావాలని ఈ సినిమాని పట్టించుకోలేదు. తరువాత సోషల్ మీడియాలో జనం వెల్లువలా మాట్లాడుతుంటే, ఇక వారికి తప్పలేదు. అప్పుడు కొందరు సమీక్షల పేరు మీద–`కాశ్మీరీల స్వఛ్చoద వలసలు, పలాయనం’ వంటి పాత కుహనా కధనాలు వినిపించారు, ఈ సినిమా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించిందని విమర్శిoచారు.
అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఈ సినిమా హిందువుల హృదయాలను కదిలించింది. కాశ్మీర్ లోయలో అప్పుడు జరిగిన సంపూర్ణ ఇస్లామియా జిహాద్, హిందువుల మారణకాండ గురించి ప్రజలు తెలుసుకుంటున్నారు. ఆ నోటా, ఈ నోటా ప్రచారం జరుగుతూ, ఈ సినిమా ఇప్పుడు ప్రభంజనంలాగా మారింది.
రాజధర్మం
భారత ప్రభుత్వం, జమ్మూకాశ్మీర్ పాలనా యంత్రాంగం ఇప్పటికైనా కొన్ని సత్వర క్రియలు చేపట్టక తప్పదు. భారత `హోలోకాస్ట్’ అనదగ్గ అప్పటి ఇస్లామియా జిహాద్, హిందువుల ఊచకోత, జిహదీలు అవలబించిన హింసా దౌర్జన్య దమనకాoడా మార్గాలు, జరిగిన మూకుమ్మడి హత్యాకాండ, సామూహిక సమాధులు, వీటన్నిoటి మీదా సమగ్ర విచారణ జరిపి, కాశ్మిరీ హిందువులకి న్యాయం జరిగేలా చూడాలి. ప్రభుత్వం తన రాజధర్మం నిర్వహించాలి.
ఆర్టికల్ 370 రద్దు అయిన తరువాత, జమ్మూకాశ్మీర్ పాలనా యంత్రాంగం తీసుకుంటున్న కొద్ది చర్యలు కూడా ఎలా ప్రతిఘటన ఎదుర్కుంటున్నాయో మనం గమనిస్తున్నాము. కాశ్మిరీ హిందువులకి తిరిగి పునరావాసం కల్పించాలనే ప్రయత్నాలు మొగ్గలోనే తుంచేయాలని, హిందువులే లక్ష్యంగా మళ్ళి జిహాదీ హింసాకాండ, దౌర్జన్యం, హత్యలు ప్రారంభమైనాయి. భయానక వాతావరణం సృష్టించి, హిందువులను వారి మాతృభూమికి రాకుండా నిరోధించాలనే ఒకేఒక లక్ష్యంతో కొన్ని వర్గాలు పని చేస్తున్నాయి.
కొన్ని దశాబ్దాలలోనే కాశ్మీర్లో 30000కు పైగా ధ్వంసం చేయబడిన దేవాలయాలను పునరుద్ధరణ చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పని సవ్యంగా జరుగుతోందని ఆశిద్దాం. 1992 అయోధ్యలో ఒక్క వివాదాస్పద కట్టడాన్ని కూల్చేసినప్పుడు, అదీ తరతరాలుగా హిందువులు నిరంతరం దాదాపు 200సంవత్సరాలు పోరాడిన కోర్టు కేసుల తరువాత; అ కూల్చివేతపై హిందువులను ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతిపాలు చేసి దూషించారు; అదే 1970s-90మధ్య కాలంలో కాశ్మీర్లో, వేలాది దేవాలయాలను ధ్వంసం చేసి, చాలా వాటిని మూత్రశాలలుగా మార్చినపుడు, భారతీయులు, ముఖ్యంగా హిందువులు, ఎప్పటిలాగే మౌనంగా ఉండిపోయారు. (విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన `హైదర్’ సినిమాలో, కాశ్మీర్ మార్తాండ సూర్య దేవాలయం శిధిలాల ముందు, హీరో వికృతమై `బిస్మిల్లా’ డాన్స్ చిత్రీకరించారు. అప్పట్లో కొంతమంది హిందువులు అభ్యంతరం చెప్పినా, హిందూ-వ్యతిరేక బాలీవుడ్ లో ఎలాంటి చలనం లేదు).
వివేక్ అగ్నిహోత్రి గారికి హిందువులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు, ఆయన తమ అద్భుత సృష్టి `కాశ్మీర్ ఫైల్స్’ ద్వారా కుహనా వాదాలెన్నింటికో సమాధి కట్టి, అబద్ధపు తెరలు తొలగించి, మొత్తం `హిందూ కధనాన్ని’ సరైన మార్గంలోకి మళ్ళించారు. దేశ-వ్యతిరేక, హిందూ-వ్యతిరేక జెఎన్‌యు విశ్వవిద్యాలయంలో, అక్కడి `ఆజాదీ’ విషప్రచారానికి లోబడిన సినిమాలో యువ నాయకుడు, అదే ప్రాంగణంలో, సత్యం ఇచ్చే ధైర్యంతో, దశాబ్దాల అసత్య ప్రచారాన్ని తిప్పికొడతాడు. అది ఈ సినిమా సాధించిన విజయం. ఈ సినిమాకి నిజమైన భూమిక- సత్యం, న్యాయం. సత్యమేవ జయతే.
No comments:
Post a Comment